చైనాలో ప్రధాని మోదీ పర్యటన..ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ..
- August 31, 2025
చైనా: ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఏడేళ్ల తరువాత చైనాలో పర్యటిస్తున్న మోదీ.. తియాజింగ్ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.దీనికి ముందు ఆదివారం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. వీరిద్ధరి మధ్య ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చ జరిగింది. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఆదివారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సరిహద్దు నిర్వహణకు సంబంధించి ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా తిరిగి ప్రారంభంకానున్నాయి. రెండు దేశాల్లోని 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు ఇరు దేశాల సహకారంతో ముడిపడి ఉన్నాయి. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు.ఈ సందర్భంగా చైనాలో పర్యటించేందుకు, ఎస్సీవో సదస్సుకు తనను ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. రెండు దేశాలు స్నేహితులుగా ఉండటం సరైన ఎంపిక అని అన్నారు. చైనా, భారతదేశం తూర్పున రెండు పురాతన నాగరికతలు. ప్రపంచంలోనే రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్ లో కూడా రెండు దేశాలు ముఖ్యమైన సభ్యులం. పక్కపక్కనే ఉన్న మనం.. స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటూ, రెండు దేశాలు అభివృద్ధికి దోహదపడే భాగస్వాములుగా ఉండటం ఇరుదేశాలకు సరైన ఎంపిక అని జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాలు బాధ్యతను తీసుకోవాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. 2019లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారతదేశంలో పర్యటించారు. అయితే, 2020లో ఇరు దేశాల సరిహద్దు అయిన లద్ధాఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనా, భారత్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొద్దికాలం తరువాత ఇరు దేశాల సైనిక, దౌత్యాధికారుల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగాయి. ఆ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చైనాపైన ఆ తరువాత భారతదేశంపై సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్