అమెరికా వీసాపై కొత్త నిబంధనతో భారతీయులకు ఇబ్బందే

- September 08, 2025 , by Maagulf
అమెరికా వీసాపై కొత్త నిబంధనతో భారతీయులకు ఇబ్బందే

అమెరికా: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది ఒక ముఖ్యమైన సమాచారం. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సొంత దేశంలో లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.ఇతర దేశాలకు వెళ్లి వేగంగా వీసా ఇంటర్వ్యూ పూర్తి చేసుకునే వెసులుబాటును అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది.

రోనా మహమ్మారి సమయంలో, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా దరఖాస్తులు భారీగా పెరిగిపోయాయి. అపాయింట్‌మెంట్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తడంతో, చాలామంది భారతీయులు దుబాయ్, బ్యాంకాక్ వంటి ఇతర దేశాలకు వెళ్లి వీసా ఇంటర్వ్యూలను త్వరగా పూర్తి చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ మినహాయింపును ప్రభుత్వం తొలగించింది.

ఈ మార్పు వల్ల పర్యాటకం (B2), వ్యాపారం (B1), విద్య (F-1), తాత్కాలిక ఉద్యోగ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారి పై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు తప్పవు. ఈ కొత్త నిబంధనల కారణంగా, విదేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్‌మెంట్‌లు తీసుకున్నవారు ఇప్పుడు తమ స్వదేశంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మార్పుల వల్ల అమెరికా ప్రయాణాలకు చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తప్పనిసరి. అలాగే, వీసా ప్రక్రియకు పట్టే సుదీర్ఘ సమయాన్ని కూడా దరఖాస్తుదారులు పరిగణనలోకి తీసుకోవాలి. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ ప్రణాళికలను మార్చుకోవడం లేదా సులభమైన వీసా నిబంధనలు ఉన్న ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com