ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?

- September 11, 2025 , by Maagulf
ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?

అబుధాబీ: ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ జట్టుతో తలపడిన యూఏఈ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అత్యంత ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి నుంచే భారత్ బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. యూఏఈ బ్యాటర్లు ఒక్కసారిగా ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోవడంతో పోరాటానికి కూడా అవకాశమే లేకుండా పోయింది.

మ్యాచ్ అనంతరం యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం మీడియాతో మాట్లాడాడు. తమ జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగ్ విఫలం కావడమేనని ఆయన స్పష్టం చేశాడు. “మా ఆటగాళ్లు కొంత ఆత్మవిశ్వాసంతో నిలబడితే కనీసం పోటీ ఇవ్వగలిగేవాళ్లం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల లక్ష్యాన్ని సెట్ చేయలేకపోయాం. టాప్ ఆర్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవాల్సిన సమయంలో త్వరగా ఔటవ్వడం మ్యాచ్ మలుపు తిప్పింది,” అని వసీం వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత వెరటన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్‌తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 4.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 93 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్‌తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్ల లో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు.ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ముహమ్మద్ వసీం..

వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అయిన భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. ‘మా బ్యాటింగ్‌ను బాగానే ప్రారంభించాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మా ఓటమిని శాసించింది. భారత్ అద్భుతమైన జట్టు. అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రతీ బ్యాటర్‌కు తగ్గట్లు వ్యూహాలతో వచ్చారు. అందుకే భారత్ నెంబర్ వన్ జట్టుగా ఉంది. ఒక జట్టుగా మేం మరింత బలంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాం. మా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం.’అని ముహమ్మద్ వసీం చెప్పుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com