తహసీల్దార్ల మూకుమ్మడి పెన్‌డౌన్
- July 29, 2016
తహసీల్దార్ల మూకుమ్మడి పెన్‌డౌన్ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రెవెన్యూ సేవలన్నీ నిలిచిపోయాయి. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించే వరకు డిజిటల్ కీ లను ముట్టేది లేదని అన్ని మండలాల తహసీల్దార్లు ఆందోళనకు దిగడం తో సర్టిఫికెట్ల జారీ ఎక్కడికక్కడ ఆగిపోయిం ది. కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీతోపాటు తహశీల్దార్ల నుంచి అందాల్సిన దాదాపు 80కి పైగా సేవలు అన్ని జిల్లాల్లో బందయ్యాయి. తెలంగాణ తహసీల్దార్ల సం ఘం(టీజీటీఏ) పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు తమ డిజటల్ కీ డివైజ్‌లను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు సరెండర్ చేశారు.సుమారు 450మంది మండల తహశీల్దార్లు మూకుమ్మడిగా పెన్‌డౌన్ చేసి ఆందోళనకు దిగారు. విధులకు హాజరైనా ఒక్క ఫైలుగానీ, ఒక్క ధ్రువపత్రంగానీ క్లియర్ చేయలేదు. రెవెన్యూ శాఖ నుంచి రోజుకు 50 వేల నుంచి 75 వేల ధ్రువపత్రాలు జారీ అవుతాయి. అయితే శుక్రవారం వీటి జారీ పూర్తిగా నిలిచి పోవడం ఉన్నతాధికారులు విస్మయానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగొచ్చింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర సచివాలయలో టీజీటీఏ ప్రతినిధులతో చర్చించారు. సమస్యలను ఆగస్టు 3 లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి టీజీటీఏ తెచ్చిన అంశాలివీ.. ► నాలుగైదు నెలలుగా వెబ్‌ల్యాండ్/ఆన్‌లైన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా రైతులకు పహాణీలు ఇవ్వడంలో అంతరాయం ఏర్పడుతోంది. సబ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన, మీసేవ నుంచి వచ్చిన మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించలేని దుస్థితి నెలకొంది. ► సాంకేతిక సమస్యల కారణంగా పౌర సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని, రేషన్ కార్డుల్లో అప్‌డేషన్లను డిజిటల్ కీ ద్వారా చేయలేకపోతున్నాం. ఫలితంగా సకాలంలో సేవలందించ లేకపోతున్నాం. ► వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పాస్ పుస్తకాల కోసం రైతుల నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు మాన్యువల్‌గా పాస్ పుస్తకాల జారీని నిలిపి వేయాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలను జారీ చేస్తామన్న ఉన్నతాధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు జవాబివ్వలేని దుస్థితి. ► సీసీఎల్‌ఏ కార్యాలయం కొత్తగా ప్రవేశపెడుతున్న సాఫ్ట్‌వేర్ గురించిగానీ, ఆన్‌లైన్ కార్యక్రమాల గురించిగానీ తహసీల్దార్లకు, రెవెన్యూ సిబ్బందికి ఇంతవరకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. జీవో 58, 59 అమల్లోనూ సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే రెండేళ్లయినా క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ► మ్యుటేషన్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని జాయింట్ కలెక్టర్లు చెబుతున్నా పట్టించుకోకుండా.. తహసీల్దార్లకు చార్జిమెమోలు జారీ చేయాలని, ఇంక్రిమెంట్‌లలో కోత విధించాలని సీసీఎల్‌ఏ ఆదేశించడం కిందిస్థాయి అధికారుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ► రెవెన్యూ అంశాలతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన హరితహారం, డబుల్‌బెడ్రూం, రేషన్ కార్డులు, పుష్కరాల ఏర్పాట్లు, కల్యాణలక్ష్మి ఉన్నతాధికారులకు ప్రొటోకాల్ పనులను కూడా తహసీల్దార్లకే అప్పగించడంతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ► జీవో 123 ద్వారా ప్రాజెక్టులకు భూములను సేకరించే పనిని తహశీల్దార్ల నెత్తిన మోపారు. రైతులను ఒప్పించలేక పోతే చేతగాని వాడివంటూ వేధిస్తున్నారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







