ప్రాణాంతకమవుతున్న సెల్ఫీలు..

- July 29, 2016 , by Maagulf
ప్రాణాంతకమవుతున్న సెల్ఫీలు..

: ప్రాణాంతకమవుతున్న సెల్ఫీల బారి నుంచి ప్రజలను రక్షించడానికి కర్ణాటక పర్యాటక శాఖ ప్రయత్నం మొదలు పెట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో గుర్తించిన 355 పర్యాటక ప్రాంతాల్లో 60 చోట్ల సెృ్ఫలను నిషేధిస్తూ నిబంధనలు రూపొందించనుంది. రాష్ట్రంలో ఇటీవల సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్లో ఉంటోందని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటకశాఖ పరిశీలనలో తేలింది. దీంతో ఈ విషయమై రాష్ట్రంలో సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటున్న పర్యాటక ప్రాంతాలు, సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలతో పాటు ఇప్పటి వరకూ చోటు చేసుకున్న మరణాలు తదితర వివరాలతో 'కర్ణాటకశాఖ' పర్యాటకశాఖకు ఓ ప్రత్యేక లేఖను రాసింది. అందులో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో 100 ప్రాంతాల్లో సెల్ఫీని నిషేధించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ఆ జాబితాను కూడా అందజేసింది. ఈ నివేదికలోని అంశాలను పరిశీలించిన పర్యాటక శాఖ ప్రస్తుతం 60 ప్రాంతాలను సెల్ఫీల వల్ల ప్రాణాపాయం సంభవించే జోన్లుగా గుర్తిస్తూ అక్కడ 'నో సెల్ఫీ' సూచన ఫలకాలను ఏర్పాటు చేయనుంది. సూచనలను అతిక్రమించినవారికి అపరాధరుసుం విధిస్తారు. అంతేకాకుండా చట్టం ప్రకారం జైలు శిక్ష వేసే విషయంపై కూడా న్యాయనిపుణులతో చర్చించనుంది. కాగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటకశాఖ సూచనపై పర్యాటకశాఖ సెల్ఫీ విషయమై అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించిన కొన్ని పర్యాటక ప్రాంతాలు ఇవే...జోగ్ జలపాతం (శివమొగ్గ), అబ్బేఫాల్స్, ఇరుపూఫాల్స్ (కొడుగు), మేకెదాటు (రామనగర్ జిల్లా కనకపుర దగ్గర), టిప్పుడ్రాప్ (చిక్కబళాపురం జిల్లా నందీహిల్స్), శివనసముద్రఫాల్స్ (మండ్యా), తుంగభద్రడ్యాం (హొసపేట), గోల్‌గుంబాచ్ (విజయపుర).
సెల్ఫీ మానసిక సమస్యగా మారుతోంది 'అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వ్యసనంగా మారి ప్రాణాలమీదకు తెస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల మాయలో పడిన యువతీ యువకులు కొన్నేళ్లుగా విపరీతంగా ఛాటింగ్‌కు అలవాటు పడి శారీరకంగా, మానసికంగా కుంగిపోయేవారు. స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా వాడుతూ సెల్ఫీలు తెరమీదకు వచ్చిన తర్వాత ఈ మోజులో పడి కొంతమంది మానసిక వ్యాధిని కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సెల్ఫీలను తరుచుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేస్తూ వాటికి లైకులు, షేర్లు, కామెంట్లు రాకపోతే విపరీతంగా బాధపడి మానసికంగా కృంగిపోతున్నారు. ఎతైన ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు, వన్యమృగాలు తదితరాలతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయం పై కొన్ని కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది'. - టిబు, సైకియాట్రిస్ట్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com