బోనాల పండుగ

- July 29, 2015 , by Maagulf
బోనాల పండుగ

 

ఆషాఢ మాసాన ఆదివారములన్ని

అమ్మ వారికి అమిత ఇష్టమంటు

తెలంగాణా ప్రజలు తెల్లవారగ లేచి

తలమీద స్నానాలు ఆచరించి

పసుపు కుంకుమ రాసి వేపకొమ్మలు జుట్టి

కుండపై దీపంత వెలుగు బెట్టి

అమ్మవారికి ఇష్ట నైవేద్య మర్పించి   

భక్తి శ్రద్ధల తోడ పూజ జేసె

 

పోత రాజులు ముందు ఆటలాడుతు నడువ

బోనాలు తల పైన బెట్టుకోని

ఆడపడుచులెల్ల అమ్మోరి గుళ్ళకు

బలగమంతా కలిసి బయలు దేరి   

కోడి పుంజులు కోసి మేక పోతులు ఇచ్చి

శిగమొచ్చిన స్త్రీలు రంగమెక్కి

భక్తి మీరగ సారె చీరలను అర్పించి

ముక్త కంఠముతోన కోరుచుండె  

 

జగమేలు మాయమ్మ జగదాంబ నీవమ్మ

మముగన్న మా తల్లి మహంకాళి

భక్తి తోడ నీకు బోనాలు దెచ్చాము

భద్రంగ జూడమ్మ భద్ర కాళి

 

కట్టపై కొలువున్న ఓ కట్ట మైసమ్మ

కను చూపుతో చెరువు గావుమమ్మ  

వాడ వాడల నున్న ఓ నల్ల పోచమ్మ

మా వాడ కాపాడు మరువ కుండ

 

 

 

ముత్యాలు మొలికించు తల్లి ముత్యాలమ్మ

ముత్యాల పగడాల పంటలిమ్ము  

ఎల్ల  దిక్కులు గాచు తల్లి  ఓ  ఎల్లమ్మ

ఎల్ల వేళల మమ్ము సల్ల గుంచు

 

మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ బాలమ్మ

పెద్దమ్మ దుర్గమ్మ భద్రకాళి

మారెమ్మ పోలేరమ్మ నూకాళమ్మ

కాళి ముత్యాలమ్మ మహంకాళి

 

ఏ పేరు పిలిచినా పలికేటి మాయమ్మ

మా ఊరు వాడలో కొలువు దీరి   

పది జిల్లలా ప్రజలు పచ్చగుండాలంటు  

ప్రేమతో దీవించి వరము లిమ్ము

 

                                    …నక్క భాస్కర రావు

   అబుధాబి

               తేది: 26. 7. 2015

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com