విఘ్నాలు తొలగించే 'విఘ్నేశ్వరుడు'

- September 04, 2016 , by Maagulf

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఈయనకు గల ఇతర పేర్లు గణపతి, బొజ్జ గణపయ్య, గణేశుడు, గణనాయకుడు, గణనాధుడు, విఘ్నేశ్వరుడు. శివ పార్వతులు పెద్ద కుమారుడు ఈయన. ఈయన తమ్ముడు కుమార స్వామి. ఈయన వాహనం మూషికం లేదా ఎలుక. వినాయకుడు నాలుగు చేతులు(ఒక చేతిలో పాశం, మరో చేతిలో అంకుశం, ఇంకో చేతిలో లడ్డు లేదా ఘంటము, మరొక చేతిలో అభయహస్తం ) కలిగి ఉంటాడు. వినాయకునికి హిందూమత సంప్రదాయంలో ఒక విశిష్ట స్థానం కలదు. అడ్డంకులను తొలగించు వాడు(విఘ్నేశ్వరుడు), అన్ని కార్యాలకు, శుభములకు, పూజలకు ప్రప్రధముగా పూజింపవలసినవాడు వినాయకుడు. హిందూ మతంలో గణేశ చతుర్థి ఒక ముఖ్య పండగ. తెలుగువారు ఈ పండుగను వినాయక చవితి అంటారు. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు ప్రారంభమై అనంత చతుర్థిన ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి పండగ వైభవంగా జరుగుతుంది. కొన్ని చోట్ల 3 రోజులకు, 5 రోజులకు, 9 రోజులకు, 11 రోజులకు నిమర్జనం చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో(ఆంధ్రా, తెలంగాణ) వినాయ చవితి సందర్బంగా... ముందుగా  "  మా గల్ఫ్ డాట్ కామ్ " పాఠకులకు ముందుగా  పండుగ శుభాకాంక్షలు.

శ్రావణ మాసం అంతా ఆడవారికి పండగల సందడి అయితే భాద్రపద మాసంలో శుద్ధ చవితితో  మొదలయ్యే గణపతి నవరాత్రుల్లో మగ వాళ్ళ సందడే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వెనకటి రోజుల్లో జరుపుకున్న గణపతి నవరాత్రులకు ఈ నాడు మనం జరుపుకుంటున్న నవరాత్రులకు ఎక్కడా పోలిక లేదనే విషయం కనబడుతుంది. ఆ రోజుల్లో  వినాయకచవితి నాడు తెల్లవారు జామునే అందరి ఇళ్ళల్లోని మగ పిల్లలంతా నిద్ర లేచి,  ఊరిలోని అందరి ఇళ్ళల్లోని దొడ్లల్లోని  చెట్ల నుండి కావలిసిన పత్రి ని  తెంపుకుని, సంచులలో  నింపుకుని, ఆనందంగా తల్లికి ఇచ్చేవారు. ఊరు నిండా మామిడిచెట్లు, రకరకాల పూలమొక్కలు, గరిక ఉండేవి.  ప్రతి ఊరులో ఒక చెరువు, చెరువు నిండా దుప్పటి కప్పినట్టుగా కలువ పూలు, చెరువు గట్టు మీద వినాయుకునికి ఎంతో  ప్రీతికరమైన  జిల్లేడు మొక్కలు ఉండేవి.  జిల్లేడు ఆకులు, కాయలు, కలువపూలు ఒకటేమిటి,  కావలిసినవన్నీ స్వహస్తాలతో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా తాజాగా తెచ్చుకునే వారు. 
చవితి నాటి తెల్ల వారుజామునే ముద్రతో చేసిన మట్టి వినాయకుని ప్రతిమలు అమ్మే వారు. వినాయకుడు రాత్రి నిద్ర చేయకూడదని అందరు అదే రోజున కొనే వారు. కుటుంబ సభ్యులంతా తలారా స్నానాలు చేసి, మడిగా ఆరేసుకున్న వస్త్రాలు ధరించి, అమ్మ  పిండి  పదార్ధాలు, ప్రసాదాలు సిద్ధం చేస్తుంటే, నాన్న  పిల్లలతో  కలిసి పూజకు అంతా సిద్ధం చేసుకునే వారు. వెదురు బద్దలతో చేసిన పాలవెల్లిని కట్టేవారు. నాలుగు పక్కలా అరటి పిలకలు, మామిడి ఆకులు అలంకరించే వారు. పీట కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పైన కాసిని బియ్యం పోసి, గణపతిని ఆసీనులు కావించేవారు. పాలవెల్లికి మొక్కజోన్న పొత్తులు, వెలగ పళ్ళు , మారేడు కాయలు, జామ, దానిమ్మ, బత్తాయి పళ్ళు దారాలతో కట్టి వేళ్ళాడదీసే వారు.
పూలు, పళ్ళు , పత్రి, పళ్ళాలలో పోసుకుని దేవుడి దగ్గర ఉంచేవారు.  వడపప్పు, పానకం, చలిమిడి, అటుకులు,  చెరకు ముక్కలు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాలతాలికలు, కొబ్బరికాయలతో పాటు అనేక రకాల పిండి వంటలతో కూడిన మహానైవేద్యం సిద్దం చేసేది గృహిణి. పిల్లలు పుస్తకాలు, పెన్నులు;  పెద్దలు పర్సులు, ఖాతా పుస్తకాలు; వినాయకుని దగ్గర పూజలో పెట్టుకునే వారు. గృహస్తు భక్తిగా వినాయకునికి పూలతో, ఇరవై ఒక్క రకాల పత్రితో  పూజచేసి, వినాయుకుని  వ్రత పుస్తకం లోని వ్రత కథ చదువుతుంటే తల్లి, పిల్లలు చేతిలో అక్షింతలతో శ్రద్ధగా వినే వారు. పూజ అంతా అయ్యాక అక్షింతలు కొన్ని గణపతి  మీద వేసి, మరికొన్ని  తమ శిరస్సుల మీద  వేసుకుని, వాటి మహాత్మ్యం  వలన  నీలాపనిందలు రాకుండా తప్పించుకునే వారు. పిల్లలు, పెద్దలు పోటీ పడి గుంజీలు తీసేవారు. ఆ రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు  వస్తాయని చూడకుండా జాగ్రత్త పడేవారు. సాయంకాలం మళ్ళీ  కథ చదువుకుని, అక్షింతలు వేసుకునే వారు. పూజ గావించిన వినాయకుని ప్రతిమను తమ వీలు కొలది ఒకటి, మూడు, అయిదు, తొమ్మిది రోజులు వుంచి, తమ ఇంటి పెరటులోని బావిలో కానీ, తమ ఊరు చెరువులో కానీ భక్తి శ్రద్దలతో నిమజ్జనం  జరిపేవారు. 
 
        

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com