లింగ నిర్ధారణ సమాచారమిక ఆన్‌లైన్‌లో ఉండబోదు..

- September 19, 2016 , by Maagulf
లింగ నిర్ధారణ సమాచారమిక ఆన్‌లైన్‌లో ఉండబోదు..

ఇకపై లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారం, ప్రకటనలు సెర్చ్‌ ఇంజిన్లలో ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. సదరు సెర్చ్‌ ఇంజిన్లు త్వరలోనే వీటిని నిలిపివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అసలేం జరిగిందంటే..గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూలాంటి ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్లు లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని, ప్రకటనలను అందిస్తున్నాయని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. గర్భంలో ఉన్న బిడ్డ ఆడో, మగో తెలుసుకునేందుకు చేసే లింగ నిర్ధారణ పరీక్షల ప్రకటనలే గాక, ఆ క్లినిక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయని సాబు మాథ్యూ జార్జ్‌ అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.దీనిపై గత జులైలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ప్రకటనలు పూర్తిగా ఆగిపోయేలా చేయలేరా అంటూ సెర్చ్‌ఇంజిన్లను ప్రశ్నించింది. అంతేగాక, వీటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.దీంతో సదరు సెర్చ్‌ ఇంజిన్‌ కంపెనీలతో చర్చించిన కేంద్రం.. త్వరలోనే ప్రకటనలు ఆగిపోనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఓ ప్రత్యేక ఆటోబ్లాక్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. లింగ నిర్ధారణ సమాచారం కోసం వెతికే 22 సంబంధిత పదాలను(కీ వర్డ్స్‌) గుర్తించామని, ఈ ఆటోబ్లాక్‌ సిస్టమ్‌ ద్వారా ఆ పదాలతో వెతికితే యూజర్లకు ఎలాంటి సమాచారం రాదని కంపెనీలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com