పుత్తడి అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి

- August 08, 2015 , by Maagulf
పుత్తడి అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి

ధర తగ్గడంతో పుత్తడి అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. గత వారం పది రోజుల్లో హైదరాబాద్‌లో అమ్మకాలు 20 శాతం వరకు పెరిగాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇక్కడి మార్కెట్లో అమ్మకాలు 30 శాతం పెరిగాయని ఎపి బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ కుమార్‌ చెప్పారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ర్టాల్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.24,950-రూ.25,550 పలుకుతోంది. దీంతో పుత్తడి ధర రూ.24,950 కంటే తగ్గే అవకాశం లేదని మార్కెట్‌ వర్గాలు చెపుతున్నాయి. ఇండియా రేటింగ్స్‌ వంటి సంస్థలైతే మేలిమి బంగారం ధర రూ.20,500 వరకు తగ్గే అవకాశం ఉందని ఇటీవల నివేదికలు విడుదల చేశాయి. మార్కెట్‌ వర్గాలు మాత్రం ఈ నివేదికలను కొట్టి పారేస్తున్నాయి. రూ.26,000కు చేరే అవకాశం శ్రావణ మాసం వస్తే అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉందని విజయ కుమార్‌ చెప్పారు. పండగల సీజన్‌తో పాటు, పెళ్లిళ్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నగల వ్యాపారులు సైతం త్వరలో కొనుగోళ్లకు దిగే అవకాశం ఉంది. దీంతో ఈ నెలాఖరులోగా పుత్తడి ధర రూ.26,000కు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ధర తగ్గినా ఆషాఢ మాసం కావడంతో ఇటీవలి వరకు ఎపి, తెలంగాణల్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద షాపుల్లో అమ్మకాలు ఒక మాదిరిగా ఉన్నా, చిన్న పట్టణాల్లో మాత్రం బాగా పడిపోయాయి. బంగారం ధర రూ.25,000 దిగువకు రావడంతో గత వారం పది రోజులుగా అమ్మకాలు పెరుగుతున్నాయి. అదే బాటలో వెండి వెండి ధర సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. దీంతో గత వారం రోజుల్లో వెండి, వెండి వస్తువుల అమ్మకాలు సైతం 30 నుంచి 40 శాతం పెరిగాయి. అయితే తమిళనాడుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి అమ్మకాలు తక్కువగానే ఉన్నాయి. ధర తగ్గడంతో అక్కడ అమ్మకాలు 50 శాతం వరకు పెరిగాయని అంచనా. ఇక్కడ మాత్రం ధర ఇంకా తగ్గుతుందనే వార్తలతో, చాలా మంది ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం వస్తే అమ్మకాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే రెండు రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావం గ్రామీణ ప్రాంత కొనుగోళ్లను దెబ్బతీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బంగారం ధర, డిమాండ్‌ పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. మహా అయితే ట్రాయ్‌ ఔన్స్‌ (31.10 గ్రాములు) ధర 1,200 డాలర్లకు చేరవచ్చు. అంత కంటే తగ్గే అవకాశాలే ఎక్కువ. - మదన్‌ సబ్నవిస్‌, ప్రధాన ఆర్థికవేత్త, కేర్‌ రేటింగ్స్‌ ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని మళ్లీ రెండు శాతానికి తగ్గించాలి. అదే జరిగితే రూపాయిల్లో బంగారం ధర మరింత తగ్గుతుంది. - జమాల్‌ మెక్‌లాయ్‌, సిఇఒ, మెక్‌లాయ్‌ ఫైనాన్సియల్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com