కలి ప్రయాణం

- August 09, 2015 , by Maagulf
కలి ప్రయాణం

అతను నడుస్తూనే ఉన్నాడు,

తనను తను తోసుకుంటూ 

 

కృతా,త్రేతా,ద్వాపర యుగాలెన్నో 

దాటుకుంటూ ప్రభువు కరుణా పాత్రుడై,

ప్రవక్తల సూక్తులు వింటూ 

బాబా లీలలు కంటూ అలా అలా 

యుగాలు  దాటుతూ 

 

నాడు, ఎన్నో అనాగరిక యుద్ధాలలో 

తెగిపడ్డ తలల మధ్య నుండి 

అరణ్య జీవుల పచ్చి మాంసం తింటూ,

జంతు చర్మాలలో 

తనను తాను దాచుకుంటూ.. 

 

మూడ విశ్వాసాల కట్టు బాట్లను తెంచుకొని,తనను తాను 

పరివర్తనంతో,సంపూర్ణ మానవునిగా ఎదిగే క్రమంలో 

పురోగమనం వైపూ నడుస్తూనే!!

 

ఇప్పుడు నాగరిక ప్రపంచంలో తను,ఆకలిని 

"రిఫ్రిజీ రేటర్లలో భద్ర పరుచుకుంటూ,

ఆశలను విమానాల్లో విహరింప జేస్తూ,

దైవ దూతననే భావనలో,

యంత్రాలను తొత్తులుగా మలచుకొని

 

ఈర్ష ,ద్వేషం,స్వార్థం అనే  

విష కూపాల,అఘాతాల లోకి 

తనను తాను తోసుకుంటూ 

 

జాతి,ప్రాంత,కుల,మత,లింగ వివక్షల లో 

తనను తాను అనగదొక్కుకుంటూ అధ:పాతాళానికి 

మనిషిగా గెలిచినా, మనసుగా గెలువని తనం లోకి 

లోతుగా, తిరోగమనం దిశగా ..ఇంకా వెళుతూనే ఉన్నాడు 

 

తనను తాను సంస్కరించు కుంటున్నాననే 

అహంకారంలో మనిషి విలువలు మరుస్తూ.. 

 

ఆది మానవుని కాలం నుండి తనను తాను ఈ యుగపు  

సంపూర్ణ "క్రూర మృగంగా" మార్చుకుంటూ ఎటో వెళుతూనే ... 

"కలి"  ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు .. 

 

(09-09-2013)

--జయ రెడ్డి బోడ (అబుధాబి) 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com