వంద రూపాయలకు 99 సినిమాలు..!

- October 01, 2016 , by Maagulf
వంద రూపాయలకు 99 సినిమాలు..!

అవునండీ ఇది నిజమే!.. ఒక్క సినిమా టికెట్ రేటే వంద రూపాయలకు పైగా ఉన్న ఈ రోజుల్లో.. వంద రూపాయలకు 99 సినిమాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది కూడా కేవలం బాలయ్య అభిమానులకు మాత్రమే ఎందుకని షాక్ అయ్యారా? ఈ అక్టోబర్ నెల ఎన్నో ప్రాముఖ్యతలను సంతరించుకుందని ఈ పాటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. బాలయ్య అభిమానులకు ఆ ప్రాముఖ్యతల్లో ఇప్పుడు ఈ స్పెషల్ బంపర్ ఆఫర్ కూడా చేరిపోయింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే.. నందమూరి బాలకృష్ణ తన నటజీవితంలో ఇప్పటివరకు 99 సినిమాలను పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక వందో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నారు. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా వంద రోజులకు పైగానే సమయం ఉంది.

ఈ నేపథ్యంలో బాలయ్య నటించిన 99 సినిమాలను ఒక్క టికెట్‌పైనే.. అది కూడా వంద రూపాయలకే ఓ థియేటర్‌లో ప్రదర్శించబోతున్నారు. లిమ్కా రికార్డు కోసం... కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నందమూరి అభిమానులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని అర్చన థియేటర్‌లో ప్రతిరోజు ఒక షోలో ఒక సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

థియేటర్ యజమాని ఓబుల్‌రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పటివరకు ఎప్పుడూ, ఎక్కడా జరగని రీతిలో ఒక హీరో నటించిన అన్ని సినిమాలను ఒకే చోట ప్రదర్శించి లిమ్కా రికార్డు దక్కించుకుంటామని ప్రొద్దుటూరు నందమూరి అభిమాన సంఘం పేర్కొంది. దసరా, దీపావళి, మొహరం, క్రిస్‌మస్ పండుగల స్పెషల్ బంపర్ ఆఫర్‌గా నందమూరి అభిమానులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ కరపత్రం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com