పని గంటల్లోనే పెట్రోల్ అమ్మకాలు

- November 03, 2016 , by Maagulf
పని గంటల్లోనే పెట్రోల్ అమ్మకాలు

15న పూర్తిగా బంక్‌ లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలియం డీలర్లు నిరసనబాట పట్టారు. ఈ నిరసనలో భాగంగా ప్రధాన చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ల నుంచి గురు, శుక్రవారాలు రెండురోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎల్లుండి (శనివారం) నుంచి కేవలం పనిగంటల్లోనే అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు పనిచేస్తాయని తెలిపారు.

సాయంత్రం ఆరు దాటిన తర్వాత బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేస్తామని చెప్పారు. 6వ తేదీ నుంచి ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారంతోపాటు బ్యాంకు, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలను నిలిపివేసి.. బంకులను మూసివేస్తామని తెలిపారు. ఈ నెల 15న పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేసి ఒకరోజు బంద్ పాటిస్తామని చెప్పారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా డీలర్లు ఇప్పటికే గత నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 15 నిమిషాలపాటు లైట్లు తీసివేసి, అమ్మకాలు నిలిపి బ్లాకౌట్‌ పాటించారు.
కమీషన్ పెంచాల్సిందే
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం 3 శాతంగా ఉన్న కమీషన్‌ను 5 శాతానికి పెంచాలని డీలర్లు ప్రధాన డిమాండ్‌ చేస్తున్నారు. ఆరు నెలలకోసారి తమ కమీషన్‌ను పెంచే దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చిన చమురు సంస్థలు ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని మండిపడుతున్నారు. అంతేకాకుండా డీలర్లకు తెలియజేయకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే విధానానికి స్వస్తి చెప్పాలని, అనవసరంగా కొత్త పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరాదని, 2012లో జారీ చేసిన మార్కెటింగ్ డిసిప్లైన్ గైడ్‌లైన్స్‌(ఎండీజీ)ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని నెరవేర్చకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com