బానిస బతుకులు
- September 06, 2015
ఒక చేతిలో గీరెల బండి ఒక చేతిలో పటకారు కర్ర,
తనకు మాత్రమే ప్రత్యేకమైన రంగు దుస్తులు
సుర్యోదయం ముందునుండే మొదలు పెడతాడు
అన్వేషణ
ఎవరో తుడుచుకొని పడేసిన టిస్యు పేపరో,పీల్చి వదిలేసిన
సిగరేటు పీకనో ఇంకా ఏదో పనికి రానీ వస్తువో లక్ష్యంగా చేసుకొని,
మధ్య మధ్యలో సిగ్నల్సులో ఆగిన వాహనాల కేసి
చూస్తాడు ఆశగా .. ఏదో ఒక చెయ్యి బయటకొచ్చి పిలుస్తుంది,
వడి వడిగా వెళ్లి ఏదో.. (పదో పరకో)
అందుకొని కృతజ్ఞ్యత తో సలాం ఒకటి చేస్తాడు
ఏ ఉన్న మారాజో, ఏదో కాస్త దయ దలిచి చేతికి
ఏదైనా సాయం చేస్తే కాదని వద్దని వారించలేని,
ఆత్మాభిమానం అడవిలోనే వదిలొచ్చిన వాడతడిపుడు
పచ్చిగడ్డి మోపులకు మోపులు కోసి తన మూగ జీవాల కోసం
వీపు నొప్పులు మోసిన మనిషి అతనొకప్పుడు
ఉన్న కొద్ది నేలలోనే రెక్కల గారడీ చేసి,రకరకాల
మనిషి నిత్యావసరాలు సృష్టించి, ఆకలి
దీర్చినవాడు అప్పుడు, ఇప్పుడేమో ఇలా..
చెత్త డబ్బాలన్నీ వేటాడుతాడు,రిసైకిల్ వస్తువులెన్నో
వ్యర్థ పదార్తాల నుండి కనుగొని వెలికి తీస్తాడు
ఖాలీ చేసి అవతల పడేసిన అట్టలన్నీ ఏరుకుంటూ కిలోలుగా
మార్చి కట్ట గట్టి, దానికి తన కన్నొకటి కావలి పెట్టి..
కాటన్ కంపని బండి కోసం ఎదిరి చూస్తాడు
ఏ కరువుకాటకం ఆ కష్ట జీవిని ఈ బయట దేశానికీ అమ్మేనో
ఏ ఆశల బాసలు,,, ఉన్న అర ఎకరాన్ని మింగి అతన్ని
తనవారెవరు కనిపించని,ఈ ఎడారి బాట నడిపేనో కదా ..
ఇప్పుడతను స్వాభిమానం చంపుకున్న మనిషే కావొచ్చు
కానీ
తన కడుపు కాల్చుకొని, కన్న పేగు ఆకలి దీర్చే
స్వార్థ రహితమైన ప్రేమ మూర్తి తానిప్పుడు ..
రూపాయి ఖర్చు పెట్టాలంటే,వంద సార్లు ఆలోచించే
పిసినారి మనిషిలానే కనిపించొచ్చు కానీ,
అతని లక్ష్యం మాత్రం ఒకటే, తన కోసం ఏండ్లకేండ్లు ఎదిరి చూసే
తన కుటుంబం ఆకలి దీర్చాలి, పోయిన అర ఎకరాన్ని,ఎకరంగా
మార్చి వారసునికివ్వాలి, ఉన్న అమ్మాయిని అన్ని లాంచనాలతో
ఓ అయ్య చేతిలో పెట్టాలి
అతనెవరో కాదు ఎవరన్నా మందలించి.. ఏ ఊరయ్య అంటే,
ఆంధ్రావాలా అనో... తెలంగాణావాలా గొప్పగా చెప్పుకునే,
అవసరాలకు అమ్ముడు పోయిన సగటు తెలుగువాడతను
విమానం లో దిగుమతి చేసుకున్న లేబర్ సరుకే కావొచ్చు
గాక అతను, తను అర్దాకలితో తనవాళ్ళ అవసరాలు దీర్చే
అత్యుత్తమమైన హ్యూమన్ బీఇంగే అతనిప్పుడు ..
ఇక్కడ అక్కడ ఇంకెక్కడైనా,
అతను మీకు కనిపిస్తే జాలి చుపించకున్నా
పర్వాలేదు కానీ,అసహ్యించుకోవద్దు ప్లీస్..
ఎందుకంటే అతనిప్పుడు సగం ప్రాణం ఇక్కడ
సగం ప్రాణం అక్కడ వదిలేసిన మనిషి .. గుండె బరువైన
మనిషి,ఇంకా ఇంకా గాయాలకు తట్టుకోలేడు..
మిత్రులారా సరే ఇక వెల్లనివ్వండతన్ని..మార్వాడి సేటింట్ల అంట్లుదోమో,
సిందీ ఫ్యామిలీ ఇల్లు కడిగో,పాకిస్తానీ కుటుంబానికి వంట జేసో
పార్టయిమ్ జాబ్ పూర్తి జేసి
రాత్రికి ఓ నాలుగ్గంటలు మాత్రమే కునుకు తీసే పాత బిల్డింగ్ లోని
తన రూముకెళ్ళి ,రెండు పెగ్గులేసి ఇంటొల్లను దల్సుకొని
నెట్లో మాట్లాడించి మనసు తృప్తి జేసుకొని గోరంత నిద్రవోవాలె ;;
(మళ్లి రేపు అంతే తన దేశం తన ఊరు ఎల్లేవరకు గీ తంతే ..21-12-2013)
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







