వర్మ ప్రోగ్రెస్ రిపోర్ట్ -2016

- January 03, 2017 , by Maagulf
వర్మ ప్రోగ్రెస్ రిపోర్ట్ -2016

బాపు గీసిన బొమ్మ గుర్తుంది. ఘంటసాల పాడిన పాట గుర్తుంది. రేపటిరోజున వర్మ తీసిన సినిమా గుర్తుంటుందా..? డౌటే. రమ్మీవారి లైఫ్ జర్నీ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే. ఇండియన్ సెల్యులాయిడ్ మీద రామ్ గోపాల్ వర్మది ఒక చెరిగిపోని బండగుర్తు. తన సినిమాల కంటే.. ఆఫ్ ద స్కీన్.. తను వేసే స్టంట్సే ఎక్కువగా గుర్తుండిపోతాయన్నది ఒక వాస్తవం. ఇంతకీ వోడ్కా వర్మ. తెలుగు సినిమాకు ఏమిచ్చారు.. ఏం నేర్పించారు.. ఏం మిగలబెట్టారన్న ప్రశ్నకైతే ఇప్పటిదాకా జవాబుల్లేవు.
చనిపోయిన తర్వాత కూడా సినిమాలు తీస్తానంటూ స్టేట్ మెంటిచ్చే మనిషి గురించి మనకు మళ్లీ మాటలెందుకనుకోకుంటే.. ఇక్కడ నాలుగు ముచ్చట్లయితే చెప్పుకోవాల్సిందే.

నాకు నచ్చినట్లు నేను తీస్తా.. నీకు నచ్చితేనే చూడమనే చండశాసనుడు సినిమా ప్రపంచంలో ఎవ్వరైనా వుంటారా అంటే.. అది వర్మ ఒక్కరే కావడం టాలీవుడ్ కి పట్టిన అదృష్టం. కత్తులతో సావాసం కొత్త కాదంటాడు. చంపు లేదా చావు అంటూ హింసాత్మక సందేశాలివ్వడంలో వెనకడుగెయ్యడు. రియాలిటీలను తెరకెక్కించే పేరు మీద రచ్చకెక్కి రొచ్చు చెయ్యడమే వర్మ సినిమాలకు దక్కే ఉచిత కమర్షియల్ ఎలిమెంట్.
ఒకప్పుడు అనంత ఫ్యాక్షనిజానికి రక్తచరిత్ర అంటూ నామకరణం చేసినా.. ఇవాళ వంగవీటి పేరుతో బెజవాడ కులగజ్జిని తెరకెక్కించినా అటువంటి తెగింపు వర్మక్కాకపోతే ఇంకెవరికుంటుంది..? సినిమా అంటే వినోదం కాదు. అంతకంటే ఎక్కువేనంటూ సంచలనాన్నే మనసావాచా నమ్మకున్న వర్మకు.. క్రిటిక్స్.. కలెక్షన్స్ జస్ట్ నథింగ్. ఎథిక్స్ గురించి అడిగితే ఆ మాటే తెలీదంటారు. ముంబై దాడుల మీద సినిమా తీస్తానంటూ తాజ్ హోటల్ శిథిలాల్లో చక్కర్లు కొట్టిన తన ఓవరాక్షన్.. ఒక ముఖ్యమంత్రి కుర్చీ కిందకే నీళ్లుతెచ్చేసింది. వర్మ స్థాయి సంచలనాలంటే అంత పీక్స్ లో వుంటాయన్నదే ఇక్కడ చెప్పదల్చుకున్న మాట.
మనోభావాలు అనే మాటంటేనే ఆయనకు మంట. మనోభావం లేదూ మట్టీ లేదంటూ కొట్టిపారేసే వర్మకు మనసే లేదని ఫిక్సయినా తప్పే. సైకో అంటూ కసికొద్దీ తిట్టేవాళ్లున్నట్లే.. మంచి సైకాలజిస్టంటూ వర్మ నెత్తిన కిరీటాలు పెట్టేవాళ్లూ ఎక్కువే. తనకుండే సామాజిక బాధ్యత గురించి అడిగితే మనకే నోరునొప్పి, ఆయన మూడేళ్ల కిందట ఏం చెప్పాడో.. ఆరేళ్ల కిందటా అదే చెప్పాడు. ఇవాళ కూడా అదే చెపుతున్నాడు. రాముడి మీద కామెంట్లేశాడు. గణేశుడు పాలు తాగడమేంటంటూ నిగ్గదీసి అడిగేశాడు. అక్కినేని నుంచి అఖిల్ దాకా అందరి కరియర్ల మీదా సెటైర్లేసుకున్నారు. సినిమాను తప్ప మరేదాన్నీ ప్రేమించనంటూ తెంచిపారేసే వర్మ. సినిమా నిర్మాణాన్ని కూడా వెయ్యి వంకర్లు తిప్పేశాడండంలో ఆశ్చర్యాలెక్కడ.?
శివలో మొట్టమొదటిసారి స్టడీ కామ్ వాడినప్పడు. తన మీద బోలెడన్ని రిమార్క్స్. ఇప్పుడాలెక్క 5డీ దాకా వచ్చేసింది. వర్కవుటైందా లేదా అన్న క్యాలిక్యులేషన్స్ కంటే.. సినిమా బడ్జెట్లో విప్లవం సృష్టించిన చరిత్రయి వర్మదేగా..? 5 రోజుల్లో 5 మందితో 5 లక్షల్లో తీసిన ఒక సినిమా తెరకెక్కిన తర్వాత ఏమైందని అడిగేవాళ్లకు.. ప్రొడక్షన్ సెక్టార్లో విప్లవం సృష్టిస్తానన్నారు.. ఏది ఎక్కడ ఎప్పుడంటూ నిలదీసేవాళ్లకు నిలబడి ఓపిగ్గా సమాధానం చెప్పే తీరిక వర్మ దగ్గర ఎప్పుడూ లేదు. ఆమాటకొస్తే. సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది అతడేనంటూ భరద్వాజ లాంటి సినిమా పెద్దలే తేల్చిపారేశారు. సినిమాను సినిమాలా కాకుండా ఒక ఫ్యాక్టరీగా మార్చి తప్పు చేశాడన్న మాటల కంటే.. వర్మ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయిన మొనగాడులాంటి డైరెక్టర్లు.. ఇవాళ తెలుగు ఇండస్ట్రేని శాసిస్తున్న మాటైతే కరెక్ట్ సినిమాతో దొరికే మెసేజ్ ల కంటే.. ఇన్ఫర్మేషన్ కంటే.. ఎమోషన్స్ మాత్రమే కీలకమనే వర్మ.. వాటికోసం ఎంతదూరమైనా పరుగెత్తడం చూస్తే ఒక్కోసారి ముచ్చటేస్తుంది. పరిటాల మర్డర్ మీద సినిమా తీస్తే ఏమవుతుంది. ఏమీ కాలేదు. అనంతలో భూకంపం వస్తుందనుకుని జడుసుకున్నవాళ్లంతా చల్లగా జారుకున్నారంతే. మధ్యలో.. ప్రొడ్యూసర్ పెట్టుకున్న నమ్మకమైతే నాశనమైంది. అది వేరే విషయం. ఐతే. అటువంటి డిజాస్టర్లు డజన్లకొద్దీ ఎదురుపడ్డా బ్యాలెన్స్ చేసుకుని ఎప్పటికప్పుడు మళ్లీ తెరమీద నిలదొక్కుకోవడం వర్మ కరియర్లో ఒక అంతుబట్టని రహస్యం. అప్పడు పరిటాల.. ఇప్పుడు వంగవీటి. సినిమా ఆడిందా లేదా అన్నది కాదు. జనం నోళ్లలో నానిందా లేదా అన్నదే వర్మ మార్క్ సక్సెస్ కి కొలబద్ద.
వంగవీటి రంగా కే కులం మీద మమకారం లేదని.. బైటికులపమ్మాయిని పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలబడ్డారని చెప్పిన వర్మ.. రంగా కులాన్ని వాడుకుని పండగ చేసుకునేవాళ్ల మీద మాత్రమే తన కసీకార్పణ్యం అంటాడు. రౌడీల్లో కూడా మంచి రౌడీలు-చెడ్డరౌడీలంటూ రెండురకాలుంటారనే వర్మ ఇవాళ. వంగవీటి సినిమాతో జనానికేం చెప్పారో ఇదమిద్ధంగా తెలీదు. వున్న కథను వున్నట్లే అచ్చుగుద్దినట్లు తియ్యగలిగాడా అంటే అది కూడా లేదక్కడ. బెజవాడని, బెంజ్ సర్కిల్ నీ ప్రభావితం చేసినంత మాత్రాన సినిమా ఆడదని తనకీ తెలుసు. ఐనా. వంగవీటి పేరును. దాని బ్రాండ్ వ్యాల్యూను వాడుకోవాలన్న క్షణికానందాలే వర్మని ఇటువంటి సినిమాల వైపు మళ్లిస్తోంది.
బాల్ థాకరే మీద. దావూద్ ఇబ్రహీం మీద. అజ్మల్ కసబ్ మీద. వీరప్పన్ మీద.. ఇలా ఏ ఒక్క వీరోచిత గాధనీ వదిలిపెట్టలేదు. అది నెగిటివ్వా. పాజిటివ్వా అన్నది తనకు అనవసరం. మంచి చరిత్రలతో పాటు. రక్తచరిత్రలు, నేరచరిత్రలు కూడా సినిమాలుగా తీస్తే తప్పేమీ లేదని.. తర్వాతి తరాలు చెడిపోతాయన్న బెంగ అస్సలే పెట్టుకోవద్దని కొట్టినట్లు చెప్పేస్తారు. ఆయనకున్న క్లారిటీ అది. వద్దు పొమ్మండానికి మధ్యలో మనమెవ్వరం? వెధవ బీడీ ముక్క కాలిస్తేనే.. ఆ సీన్ల మీద ఇంజూరస్ టు హెల్త్ అని సబ్ టైటిల్స్ వేస్తారు. మరి.. వర్మ తీసే సినిమాకు సెన్సారోళ్లు సరిఫికెట్లు ఎలా ఇస్తారనే ఆవేశాలకు అర్థాలెక్కడ?
వర్మంటేనే ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమావాడిగా తనకు బతుకునిచ్చిన శివ మూవీ. బ్రూస్లీ తీసిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కి రీమేక్ అంటూ తనే చెప్పుకున్నాడు. మనింట్లో ఒకరు తగ్గితే వాళ్లింట్లో కూడా ఒకడు తగ్గాలంటూ.. చంపుకోవడమనే కాన్సెప్ట్ ని అదేపనిగా ప్రమోట్ చేసుకుంటాడు. తన సినిమాకు తనే హీరోనంటాడు. ఒట్టువేస్తాడు.. వేసిన ఒట్టును తీసి తనే గట్టున పెట్టేస్తాడు. నేనే దేవుణ్ణి అన్నది అతడి అహం ఐతే. మిగతా వాళ్లకు అదొక ఎంటర్టైన్మెంట్, బోరు కొడితే వర్మ ట్విట్టర్ ఆన్ చేస్తానని అతడి ఆప్తమిత్రుడే స్టేట్మెంటిచ్చేశాడు. సినిమాలు చూస్తే మంచోళ్లు చెడ్లోళ్లు కారని, చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మారిపోరని బల్లగుద్ది చెప్పే వర్మ గానీ, వర్మ శిష్యబృందం గానీ.. సొసైటీ మీద సినిమా మాధ్యమం చూపే ప్రభావమెంతన్న లెక్కల్ని వేసుకున్నారో లేదో తెలీదు.
వర్మ సినిమా పిచ్చోడే కాదు. కన్ఫ్యూజన్ మాస్టర్. పచ్చి అబద్ధాల కోరు అంటూ మేలురకం జర్నలిస్టులే సర్టిఫికెట్టిచ్చేశారు. వర్మ అంటే 200 పర్సెంట్ ఇర్రెస్పాన్సిబులిటీ అంటూ పొగిడేసే శ్రేయోభిలాషులున్నట్టే.. పిల్లాడ్ని జడిపించే బూచాడంటూ వర్మకు దూరంగా జరిగే వర్మాభిమానులూ వుంటారు. తన పేజీల నిండా సెక్సీ ఉమెన్, ఓడ్కా, గ్యాంగ్ స్టర్, దయ్యాలు, ఎప్పటికప్పుడు తనకనువుగా మార్చుకునే తత్త్వశాస్త్రాలు, కుటుంబవిలువలు-సామాజిక బాధ్యతలు. అన్నీ నవ్వుకోడానికి పనికొచ్చే సిద్ధాంతాలే.
నోరు పారేసుకోవడం వర్మకు ఇష్టం. అది వర్మ వ్యక్తిగతం కూడా, వర్మ మీద నోళ్లు పారేసుకునే మిగతా జనాలది భావప్రకటనాస్వేచ్చ అనే ఒక ప్రాధమిక హక్కు. కానీ.. నిద్రలేచిన ప్రతిసారీ లోకాన్ని కొత్తగా చూడాలన్న వర్మ క్రియేటివిటీకైతే వందకు వంద మార్కులు వెయ్యాల్సిందే. ఒకవేళ.. మనం వెయ్యకపోయినా.. ఆయనే వేసుకుంటారు. దటీజ్ వర్మ,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com