తొలిసారి మహిళాదినోత్సవం జరుపుకుంటున్న సౌదీ మహిళలు

- February 06, 2017 , by Maagulf
తొలిసారి మహిళాదినోత్సవం జరుపుకుంటున్న సౌదీ మహిళలు

ఇస్లాం దేశమైన సౌదీ అరేబియాలో తొలిసారి మహిళా దినోత్సవం జరుపుతున్నారు. రియాద్‌లోని కింగ్‌ ఫహద్‌ కల్చర్‌ సెంటర్‌లో ఈ వారాంతంలో మూడు రోజుల పాటు మహిళాదినోత్సవ ప్రత్యేక సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రిన్సెస్‌ అల్‌-జవహరా బింట్‌ ఫహద్‌ అల్‌-సౌద్‌తో పాటు రాజకుటుంబానికి చెందిన పలువురు స్త్రీలు హాజరుకానున్నారు. విద్యారంగంలో మహిళల పాత్ర గురించి, సౌదీలో స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి ముగింపు పలకడం గురించి, మహిళల హక్కుల గురించి ఇక్కడ చర్చించనున్నారు.విద్య, సాంస్కృతిక, వైద్య, సాహిత్య తదితర ఎన్నో రంగాల్లో సౌదీ మహిళల విజయాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటున్నట్లు అధికార ప్రతినిధి మహమ్మద్‌ అల్‌-సైఫ్‌ వెల్లడించారు.


మహిళల హక్కులు కాలరాస్తున్నారని సౌదీపై ఎంతోకాలంగా ఆరోపణ ఉంది. 2015లో ప్రపంచ ఎకనమిక్‌ ఫోరం లింగ వివక్షపై ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 145దేశాల్లో సౌదీ 134వ స్థానంలో ఉంది.


మహిళలు డ్రైవింగ్‌ చేయకూడదని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందకూడదని నిషేధం విధించిన తొలి దేశం సౌదీ అరేబియా. అలాగే ఇక్కడ మహిళలందరూ తండ్రి లేదా భర్త లేదా సోదరుల అనుమతితోనే చదువు, విదేశీ ప్రయాణాలు, వివాహం చేసుకోవడం చెయ్యాలి. సౌదీ అరేబియాలో మహిళల జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు పురుషుల చెప్పుచేతల్లో నడుస్తోందని మానవహక్కుల పరిరక్షణ సంఘం పేర్కొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com