నాతో బలవంతంగా రాజీనామా చేయించారు: పన్నీర్ సెల్వం

- February 07, 2017 , by Maagulf
నాతో బలవంతంగా రాజీనామా చేయించారు: పన్నీర్ సెల్వం

ఇప్పటికే తారాస్థాయికి చేరిన తమిళనాడు రాజకీయాలు మంగళవారం రాత్రి పెను సునామీలా మారాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటు, ఆమె స్థానంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించినా, చిన్నమ్మ శశికళ కోసం పదవీత్యాగం చేసిన ఓ.పన్నీర్‌ సెల్వం ఎట్టకేలకు నోరు తెరిచారు. 'అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది..' అంటూ సమరశంఖాన్ని పూరించారు.

శశికళ పేరెత్తకుండానే ఆమెను టార్గెట్‌ చేశారు. 'నా చేత బలవంతంగా రాజీనామా చేయించారు' అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శశికళ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే ఓపీఎస్‌ తిరుగుబావుటా ఎగరేయడం రాజకీయ సంచలననానికి దారితీసింది. 

మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు చేరుకున్న పన్నీర్‌ సెల్వం.. దాదాపు 50 నిమిషాలు ఒంటరిగా కూర్చొని దీక్ష చేశారు. మధ్యమధ్యలో అనునాయులు వచ్చి వేడుకున్నా, పన్నీర్‌ అక్కడి నుంచి కదలలేదు. చివరికి దీక్ష ముగిసిన తర్వాత పన్నీర్‌ మీడియాతో మాట్లాడారు. 'దేశ ప్రజలకు నేను కొన్ని నిజాలు చెప్పాలి.. చెప్పమని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది..'అంటూ తన బాధను వ్యక్తం చేశారు.

ప్రజల ఆమోదం ఉన్న వ్యక్తికే పార్టీ పగ్గాలుగానీ, పరిపాలనా బాధ్యతలుగానీ కట్టబెట్టాలన్నది అమ్మ(జయ) ఆశయమని, అయితే ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు ఆమె(జయ) లక్ష్యాలకు విరుద్ధమని పన్నీర్‌ సెల్వం అన్నారు. పార్టీ కార్యదర్శిగా మధుసూదన్‌ను నియమించాలని జయ అనుకున్నారని, కానీ చివరికి శశికళకే పగ్గాలు అప్పగించాల్సివచ్చిందని చెప్పారు. 'నేను సీఎంగా ఉన్న సమయంలోనే కొందరు మంత్రులు ప్రెస్‌ మీట్లు పెట్టిమరీ 'శశికళే సీఎం అవుతారు'అని ప్రకటించడం నన్ను అవమానించినట్లు కాదా?'అని పన్నీర్‌ ఆవేదన చెందారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు.

మనసులో దాచుకున్నవన్నీ మీడియాకు చెప్పేసిన పన్నీర్‌ సెల్వం.. తర్వాత ఏం చెయ్యబోయేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన మాట్లాడిన తీరును బట్టి 'శశికళ సీఎం కాకుండా అడ్డుకోవడమే' లక్ష్యంగా కనిపించింది. అయితే, ఇప్పటికే పన్నీర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించిన దరిమిలా.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? అన్నది సందేహాస్పదమే. పైగా, అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో 60 శాతం మంది శశికళ అనునాయులేకావడం పన్నీర్‌ను అసహాయుడిని చేసే ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వ(గవర్నర్‌) సహాయంతో పన్నీర్‌ తమిళనాడులో మళ్లీ చక్రం తిప్పబోతున్నారన్నది ఖాయం. అది ఏ దిశలో జరగబోతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com