మయూరి:రివ్యూ

- September 21, 2015 , by Maagulf
మయూరి:రివ్యూ

నయనతార ప్రధాన పాత్ర పోషించిన హారర్ మూవీ ‘మయూరి'. తమిళంలో ‘మాయ' పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ తెలుగులో విడుదల చేసారు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఈ హారర్ సినిమాలో నటించడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ చిత్ర ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్న దాంట్లో ఎంత నిజం ఉందో రివ్యూలో చూద్దాం..

నటనను వృత్తిగా ఎంచుకున్న మ‌యూరి (న‌య‌న‌తార‌), అర్జున్(అరి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్న గొడవలతో ఇద్దరూ విడిపోతారు. అర్జున్ మయూరితో మళ్లీ కలవాని ఎంత ప్రయత్నించినా మయూరి మాత్రం అతన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తన ఫ్రెండ్ స్వాతి ఇంట్లో తన పాపతో మీరాతో కలిసి జీవితస్తుంటుంది మయూరి.

డబ్బు సమస్యల్లో ఉన్న మయూరికి అర్జున్ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు...కానీ మయూరి మాత్రం అతని డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడదు. అప్పులు తీర్చడానికి, బతుకు బండి సాగించడానికి ఏవో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ చేస్తూనే నటిగా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది మయూరి. కాగా...మాయావ‌నం అనే భ‌యంక‌ర‌మైన అడ‌విలో మాయ అనే మ‌హిళ ఆత్మ తిరుగుతుంద‌ని, మాయపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌ుపడానికి అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదనే ప్రచారం జరుగుతుంది. ఈ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆర్.కె. ‘చీకటి' అనే సినిమాను తెరకెక్కిస్తాడు. సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగా తమ సినిమాను ఒంటరిగా భయపడకుండా చూస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి మయూరి ఆ సినిమాని ఒంటరిగా చూడటానికి ఒప్పుకుంటుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడే మయూరికి, ఆ సినిమాకు ఒక సంబంధం ఉందన్న నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ మాయ ఎవరు? మయూరికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే. పెర్పార్మెన్స్ పరంగా నయనతార అదరగొట్టింది. తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. ఆమెతో పాటు ఆరి, అమ్జాత్‌ ఖాన్‌, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్‌ తదితరులు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారని చెప్పుకొచ్చు.ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకులకు అసలు సిసలైన హారర్ అనుభూతిని కలిగించాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు కథలోకి పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయిపోతూ ఆ 'మాయా' ప్రపంచంలోకి వెళ్లిపోయి, క్యారెక్టర్ల తాలూకు భావోద్వేగాల్ని అనుభవించేలా చేస్తుంది. కథకు తగిన విధంగా రాన్‌ యోహాన్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరింత భయానికి గురి చేస్తుంది. మద్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అసలు సిసలైన హారర్ సినిమా అంటే ఇలానే ఉంటుంది నేలా ఉంది. ప్రేక్షకులు కొత్తరకం హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందుతారు. అయితే కథను చెప్పే క్రమంలో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేసాడు. సినిమాలో.... మరో సినిమాను చూపిస్తూ దాన్ని రియాల్టీకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో కొంత సేపు ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. అయితే అసలు విషయం ఏమిటనేది క్లైమాక్స్ లో స్పష్టత వస్తుంది. దీంతో పాటు సినిమా చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. చూపిన సీన్లనే మళ్లీ చూపించడం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు సరికొత్త హారర్ ఎక్స్‌పీరియన్స్‌, థ్రిల్ పొందుతారు. హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్. ఒంటరిగా కాకుండా ప్రెండ్స్‌తో కలిసి వెళితే హారర్‌ను మరింత ఎంజాయ్ చేస్తారు. 

 

 

--మాగల్ఫ్.కాం రేటింగ్:3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com