నిరాడంబరత చాటుకున్న క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌

- April 14, 2017 , by Maagulf
నిరాడంబరత చాటుకున్న క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌

క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ మానవత్వాన్ని చాటుతున్నారు. మనుషులంతా ఒక్కటేనన్న దేవుని సిద్ధాంతాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆచరించి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈసారి కరుడుగట్టిన ఖైదీల కాళ్లు కడిగి ముద్దు పెట్టుకున్నారు. ఇలా జైళ్లకు వెళ్లి ఖైదీల కాళ్లుకడిగే సంప్రదాయాన్ని నాలుగేళ్ల కిందట ప్రారంభించారు. క్యాథలిక్స్‌ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌ 12 మంది కాళ్లు కడిగి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఆ కాళ్లు కడిగిన వారంతా కరుడు కట్టిన ఖైదీలు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. క్రైస్తవులకు పవిత్రమైన గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ వేడుకల నిర్వహణలో భాగంగా మానవత్వాన్ని చాటేలా ఏటా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వాటికన్‌సిటీలో సంప్రదాయంగా వస్తోంది. చనిపోయే ముందు రోజు రాత్రి ఏసుక్రీస్తు కూడా ఇలాగే తన 12 మంది శిష్యుల కాళ్లు కడిగినట్లు క్రైస్తవులు చెబుతుంటారు.. ఆ సంప్రదాయాన్ని పోన్‌ ఫ్రాన్సిస్‌ కొనసాగిస్తున్నారు. కరుడుగట్టిన ఖైదీలు ఉండే దక్షిణ రోమ్‌లోని ఫారెంట్రస్‌ జైలును సందర్శించిన పోప్‌.. అక్కడ 12 మంది ఖైదీల కాళ్లు కడిగి ముద్దు పెట్టుకున్నారు. ఈ ఖైదీల్లో మాఫియా మాజీ సభ్యులూ ఉన్నారు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటేనని, అంతా శాంతి మార్గాన్ని అనుసరించాలని ఈ సందర్భంగా పోప్‌ ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది ఒక హిందువు సహా పదకొండు మంది వివిధ మతాలకు చెందిన వారి కాళ్లను కడిగారు పోప్‌. అనంతరం ముద్దు పెట్టుకుని ప్రేమ, మత సామరస్యాలను చాటుకున్నారు. గత ఏడాది పోప్‌ చేత కాళ్లు కడిగించుకున్న వారిలో భారతీయ హిందువుతోపాటు, నలుగురు నైజీరియన్‌ క్యాథలిక్కులు, ముగ్గురు ఎరిత్రయ మహిళలు, మాలి, పాక్‌, సిరియాకు చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు. ఫ్రాన్సిస్‌కు ముందున్న పోప్‌లు కేవలం క్యాథలిక్కుల కాళ్లు మాత్రమే కడిగేవారు.. అయితే ఫ్రాన్సిస్‌ అధిపతి అయిన తర్వాత అందులో మార్పులు చేశారు. ఇతర మతాల వారితోపాటు, స్త్రీలను కూడా ఎంపిక చేసి కాళ్లు కడగడం ప్రారంభించారు. దీనిని సోదర స్పర్శగా పోప్‌ చెబుతారు. ఇది గొప్ప సంప్రదాయంగా, ప్రపంచ మానవాళికి ఆదర్శమైనదిగా అంతా పేర్కొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com