బాబు బాగా బిజీ రివ్యూ

- May 05, 2017 , by Maagulf
బాబు బాగా బిజీ రివ్యూ

చిత్రం:  బాబు బాగా బిజీ 
తారాగ‌ణం: అవ‌స‌రాల శ్రీనివాస్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, శ్రీముఖి, ప్రియాంక ఐసోల‌, తేజ‌స్వి మ‌దివాడ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప్రియ‌ద‌ర్శి, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుధ, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ త‌దిత‌రులు 
సాంకేతిక‌వ‌ర్గం:  ఛాయాగ్ర‌హ‌ణం:  సురేష్ భార్గ‌వ‌,  స‌ంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌, మాట‌లు:  మిర్చి కిర‌ణ్‌,  కూర్పు: ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌,  నిర్మాత‌: అభిషేక్ నామా, ద‌ర్శ‌క‌త్వం: న‌వీన్ మేడారం. 
నిర్మాణ సంస్థ‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌ 
విడుద‌ల‌: 5 మే 2016
విజ‌య‌వంత‌మైన క‌థ‌ల్ని దిగుమ‌తి చేసుకోవ‌డంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. యువ ద‌ర్శ‌కులు సొంతంగా స‌రికొత్త క‌థ‌ల్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నప్ప‌టికీ నిర్మాత‌లు పొరుగు భాష‌ల నుంచి కూడా క‌థ‌ల్ని దిగుమ‌తి చేసుకోవ‌డంపై ఆస‌క్తి చూపుతున్నారు. అందుకే విరివిగా రీమేక్ చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. హిందీలో విజ‌య‌వంత‌మైన `హంట‌ర్‌` చిత్రాన్ని తెలుగులో `బాబు బాగా బిజీ` పేరుతో రీమేక్ చేశారు. అందులో అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం అటు ప్రేక్ష‌కుల‌తో పాటు.. ఇటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఆస‌క్తి రేకెత్తింది. మ‌రి బాబు ఎలా ఉన్నాడు? ఆయ‌న చేసిన సంద‌డి ఎలాంటిదో తెలుసుకుందాం...
క‌థేంటంటే? 
మాధవ్‌(అవసరాల శ్రీనివాస్‌) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్లేబాయ్‌ మనస్తత్వం. టీనేజీ నుంచే క్షణాల్లో అమ్మాయిలకు దగ్గరవుతూ.. వారిని సొంతం చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మాధవ్ ఒక దశలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయనికి వస్తాడు. పెళ్లి చూపుల్లో నిజాయితీగా తన గతాన్ని చెబుతాడు. అతడి కథంతా విన్న వారంతా అతన్ని ఛీకొట్టి వెళ్తుంటారు. స్నేహితుల బలవంతం మేరకు రాధా (మిస్తీ)కి మాత్రం గతం చెప్పకుండా దగ్గరవుతాడు. ఆమెతో మాధవ్‌కి పెళ్లి నిశ్చయమవుతుంది. మరీ మాధవ్‌ అసలు రూపం రాధకి ఎప్పుడు ఎలా తెలిసింది? రాధ గతమేంటి? వాళ్లిద్దరు వివాహం చేసుకున్నారా లేదా? మాధవ్‌ జీవితంలోకి వచ్చిన పారు(మదివాడ తేజస్వి).. శోభ(శ్రీముఖి).. చంద్రిక (సుప్రియ) కథలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
ఎలా ఉందంటే?: హిందీ చిత్రం ‘హంటర్‌’ని తెలుగు నేపథ్యానికి.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించారు. కథను మొదలుపెట్టిన విధానం.. ముగించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. సాదాసీదా కథే అయినా కథనం కొత్తరకంగా ఉంటుంది. సినిమా ఆరంభం నుంచి సన్నివేశాలన్నీ సరదా సరదాగా సాగిపోతాయి. అక్కడక్కడ కథలో వేగం తగ్గినట్టు అనిపించినా.. నటీనటులు.. సంభాషణలు.. వినోదంతో ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపం అవుతుంది. కథని మరింత ఆసక్తికరంగా.. కామెడీతో తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం జరిగి ఉంటే బాగుందేడి. నటీనటులు.. సాంకేతిక విభాగం పనితీరును ఆకట్టుకునేలా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో మరింత డ్రామా ఉంటే బాగుండేదన్న భావన కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే?: మాధవ్‌ అనే ప్లేబాయ్‌ పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్‌ పరంగా ఆయనలో వేరియేషన్స్‌ కనిపించలేదు. ప్రతీ సన్నివేశంలో ఒకేలా కనిపించటమే కొరత. హీరోయిన్లు నలుగురు ఉన్నప్పటికీ మిస్తీకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌.. ప్రియ‌ద‌ర్శి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన బలం. చాలా చోట్ల ఆ సన్నివేశాలు నవ్వులు పండించాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. రీమేక్‌ సినిమా అనే భావన కలగకుండా ఉండేలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారు. మిర్చి కిరణ్‌ మాటలు అలరిస్తాయి. ఛాయగ్రహణం.. సంగీతం కూడా కథకు బలానిచ్చాయి. నిర్మాణ విలువల్లో లోటు లేదు. కాకుంటే.. సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేందుకు ఇబ్బంది పెట్టేలా ఉంటాయి.
బలాలు 
కథ.. కథనం 
నటీనటులు 
మాటలు
బలహీనతలు 
- నెమ్మదిగా సాగే కథ 
- కుటుంబమంతా కలిసి చూసేలా లేని కొన్ని సన్నివేశాలు 
- క్లైమాక్స్‌ 
- పతాక సన్నివేశాలు
చివరగా.. కాలక్షేపమే.. కానీ షరతులు వర్తిస్తాయి! 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com