నాన్న జీవితం ఓ అద్భుత పాఠం.. సందేశం

- June 17, 2017 , by Maagulf
నాన్న జీవితం ఓ అద్భుత పాఠం.. సందేశం

ప్రపంచవ్యాప్తంగా జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకొంటున్నారు.. ''ఓ నాన్నా... నీ మనసే వెన్నా... అమృతం కన్నా అది ఎంతో మిన్నా....!'' అని ఒక సినీ కవి అన్నా,''ఔదార్యాన్ని గాంభీర్యాన్ని అనురాగాన్ని త్యాగాన్ని రంగరిస్తే తయారయ్యే ఆత్మీయ రూపం నాన్న'' అని మరో కవి వర్ణించినా, ''బ్రతుకు నావ వ్యసనాల గాలికి కొట్టుకు పోకుండా క్రమ శిక్షణల తెర చాపలను పైకెత్తి గమ్యం వైపు నడిపించే దీప స్థంభం నాన్న '' అని సాహిత్యంలో కవితాత్మకంగా వివరించినా అంతా 'నాన్న' గొప్పతనం గురించే. నాన్న జ్ఞాపకాలలో కలాన్ని ముంచి ఎందరో ప్రముఖులు కథలు, కవిత్వం, వ్యాసాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో నాన్నను ఆవిష్కరించారు.  అంతేకాదు. పాతతరం నుంచి వర్తమానం వరకూ ఎన్నో సినిమాలు కుటుంబంలో , సమాజంలో నాన్నకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ వచ్చినవే. కన్న పేగు ప్రేమ అమ్మదైతే.. కను రెప్ప రక్ష నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. నాది అని బిడ్డ భావించే ప్రతి దానికి పునాదిగా ఉండి సాధనకు తోడ్పడేవి బాల్యంలో తండ్రితో కలసి ప్రేరణ పొందిన మధుర క్షణాలే. లోకంలో ఏ నాన్న కైనా కన్నబిడ్డల తోటే లోకం. కాలం బాట మీద కనిపించని సాధకుడు నాన్న.  ''నాన్న''.....అనే పదం. 'అమ్మ' అనే పదం తర్వాతదైనా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన భావన. 'అమ్మ' వాస్తవం, 'నాన్న' నమ్మకం అంటారు. నవ మాసాలూ మోసి ఎంతో ప్రసవ వేదననుభవించి ఒక శిశువును తల్లి భూమి మీదకు తీసుకొస్తే.. ఆ శిశువు యుక్తవయసుకు వచ్చే వరకూ, ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దే వరకూ కంటికి రెప్పలా భరోసాగా నిలిచేది కన్న తండ్రి లాలించి.. లాలపోసి.. అడుగులేయించి.. అక్షరాలు పలికించి అన్నీ తానై తోడూ నీడగా ఉండే 'నాన్న'కు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానముంటుంది. చిన్నతనంలో నాన్న చెప్పుల జతలో తప్పటడుగులతోనే ఏ బిడ్డయినా జీవిత పరుగు పందాన్ని మొదలు పెడుతుంది. ఉద్యోగం, ఉపాధి అంటూ ఉదయాన్నే లేచి వెళ్లే 'నాన్న'.. ఇంటి పట్టున ఉండలేడు. కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు కోసం వారిని కష్టపెట్టినా అది వారి ఉన్నతి కోసమే. నాన్న అనురాగానికీ, ఆప్యాయతలకు ప్రతీక మాత్రమే కాదు. మార్గదర్శిగా ఉంటూ పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి నిరంతరం తపన పడుతుంటాడు. పెళ్లయి అత్తారింటికి వెళ్లినా ఆడపిల్లకు తండ్రి లాలన పట్లే మక్కువ ఎక్కువ. ఉద్యోగాలొచ్చి ఎక్కడెక్కడో స్థిరపడే మగ పిల్లలను కూడా బాల్యంలో తండ్రి నేర్పిన క్రమశిక్షణే ముందుకు నడిపిస్తుంది.  ప్రస్తుత సమాజంలో కుటుంబ నిర్వహణలో అమ్మతోపాటు బాధ్యతలను పంచుకోవడానికి నాన్న పోటీ పడుతున్నాడు. వంట పనిలో, ఇంటి పనిలో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లల సంరక్షణలో తన వంతు సహాయం చేసేందుకు నాన్న సిద్ధంగా ఉండటాన్ని నేడు చాలా ఇళ్లలో చూస్తున్నాం. వంట పనిలో అమ్మ బిజీగా ఉంటే పిల్లల్ని నిద్ర లేపడం, స్నానం చేయించడం, వారిని స్కూల్‌కు సిద్ధం చేయడంలో నాన్న సహకరిస్తున్నాడు. తల్లి కన్నా పిల్లలు తండ్రికే ఎక్కువ చేరిక అవుతున్నారు. తల్లి దగ్గర భయాన్ని చూపించే ఆడ పిల్లలు కూడా తండ్రి దగ్గర స్వేచ్ఛగా తమ మనోభావాలను బయటపెట్టడంలో వెనుకంజ వేయడం లేదు. పిల్లలు తండ్రిని తమ మొదటి స్నేహితునిగా అభిమానిస్తున్నారు. పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి గొప్పలకూ పోకుండా భార్యకు సహకరిస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. చదువుల్లో పిల్లల ప్రగతి, వైఫల్యాల గురించి ఆరా తీస్తూ వారి భవిష్యత్‌ కలలను సాకారం చేసేందుకు నాన్న ఎంతగానో ఆలోచిస్తున్నాడు. పరీక్షల సమయంలో అనుక్షణం పిల్లలను మానసికంగా సన్నద్ధం చేస్తూ, వారికి ధైర్యాన్ని నూరిపోయడంలో నాన్న చేస్తున్న కృషి  తక్కువేమీ కాదు. తల్లులను తక్కువ చేయడం కాదు కానీ, జీవితం లో తండ్రి పంచే వాత్సల్యం, నేర్పే జీవిత పాఠాలు అమూల్యం, అద్భుతం. తల్లి ప్రేమకు గానీ తండ్రి చూపించే వాత్సల్యానికి  గానీ సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఏమీ లేవు. మన తల్లిదండ్రులు నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని, వారికి దగ్గరుండి సేవ చేసుకునే బుద్ధి, శక్తి సామర్ధ్యాలు పుత్రులలో పెరగాలని ఆశిస్తూ..... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com