ఎయిరిండియా ఎకానమీ క్లాస్లో శాఖాహారం మాత్రమే

- July 10, 2017 , by Maagulf
ఎయిరిండియా ఎకానమీ క్లాస్లో శాఖాహారం మాత్రమే

తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.. ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా.. దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని తెలిపింది. కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని పేర్కొంది. అయితే ఎయిరిండియా అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. 
'గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించట్లేదు. దీని వల్ల ఎయిరిండియాకు ఏడాదికి రూ.7 నుంచి 8కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నాం' అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 
ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఎయిరిండియాలోని కొన్ని వాటాలను అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ప్రయివేటీకరణ నుంచి ఎయిరిండియాను కాపాడేందుకు కొందరు సంస్థ ఉద్యోగులు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే.. ఖర్చు తగ్గే ప్రణాళికలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దేశీయ విమానాల్లో మాంసాహారం అధికంగా వృథా అవుతుందని కొందరు సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నారు. 
గత నెల్లో క్యాబిన్ సిబ్బంది ఒకరు ఎయిరిండియాకు ఈ ప్రణాళికల గురించి ఇంటర్నల్ మెయిల్ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 'కొన్ని అంతర్జాతీయ విమానాల్లో సలాడ్లు వృథా అవుతున్నాయి. కేవలం 20శాతం ప్రయాణికులు మాత్రమే సలాడ్లను తీసుకుంటున్నారు. అందుకే అంతర్జాతీయ విమానాల్లో సలాడ్లను ఇవ్వడం నిలిపివేస్తే బాగుంటుంది. ఇక, ఎయిరిండియా మ్యాగజైన్ 'శుభ్ యాత్ర'ను కూడా పత్రి సీటు ముందు కాకుండా.. ఒక ర్యాక్ ఏర్పాటుచేసి అందులో 25 కాపీలు ఉంచితే సరిపోతుంది' అని సదరు సిబ్బంది మెయిల్లో పేర్కొన్నట్లు చెప్పారు. 
సిబ్బంది సూచనలను పరిశీలిస్తున్నట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాగా.. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రయివేటు విమానయాన సంస్థ ఇండిగో ఆసక్తి చూపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com