కేంద్ర క్యాబినెట్‌ బంగారం పెట్టుబడులపై కీలక నిర్ణయం

- July 26, 2017 , by Maagulf
కేంద్ర క్యాబినెట్‌ బంగారం పెట్టుబడులపై కీలక నిర్ణయం

 పరిమితిని భారీగా పెంచిన ప్రభుత్వం
♦ ప్రస్తుతం 500 గ్రాములకే అనుమతి
♦ మరింత ఆకర్షణీయంగా మర్చే యత్నం
బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్ర క్యాబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో(ఎస్‌జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన కొనుగోలు పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటామని క్యాబినెట్‌ భేటీ అనంతరం  అధికారిక ప్రకటనలో తెలియజేశారు. తాజా నిర్ణయం ప్రకారం, ఒక వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం వార్షికంగా 4 కేజీల వరకూ గోల్డ్‌ బాండ్‌పై పెట్టుబడిపెట్టే వీలుంది.
ట్రస్టులు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందిన సంస్థలకు ఈ పరిమితి 20 కేజీలుగా ఉంది. విభిన్న రేట్లకు వివిధ రకాల సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను రూపొందించడం, ప్రవేశపెట్టడం వంటి వెసులుబాటును కూడా ఆర్థికశాఖకు కల్పించడం తాజా నిర్ణయంలో ప్రధానాంశం. అవసరమైతే ఏజెంట్ల కమీషన్‌ పెంచే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు. 2015 నవంబర్‌ 5న గోల్డ్‌ బాండ్‌ పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ పథకం ద్వారా 2015–16, 2016–17లో రూ.25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, రూ.4,769 కోట్లే ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com