వైరస్‌పై 3డీ సినిమా రూపొందించిన అమెరికా శాస్త్రవేత్తలు

- August 15, 2017 , by Maagulf
వైరస్‌పై 3డీ సినిమా రూపొందించిన అమెరికా శాస్త్రవేత్తలు

జీవితచక్రాన్ని వీడియోగా రూపొందించిన అమెరికా శాస్త్రవేత్తలు 
 మన శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ముందుగా మన కణజాలంలోని ఒక ఆరోగ్యవంతమైన కణంలోకి చేరి అందులో ఉన్న పదార్థాలను ఆరగించేస్తుంది. ఆ తర్వాత అందులో తన సంతతిని వందల సంఖ్యలో వృద్ధి చేస్తుంది. అనంతరం ఆ కణాన్ని పగులగొట్టి వందల సంఖ్యలో వైరస్‌లు విడుదలై ఇతర కణాల మీదికి దాడి చేస్తాయి. మనం గుర్తించలేనంత తక్కువ సమయంలో జరిగిపోయే ఈ ప్రక్రియ గురించి వివరించడానికి ఇన్నాళ్లూ సరైన ఆధారాలే లేవు. వైరస్ కణం మీద దాడి చేస్తున్న ఫొటో ఒకటి, వేలసంఖ్యలో వైరస్ కణాలు వృద్ధి చెంది బయటికి వచ్చే ఫొటో ఒకటి చూపుతూ పూర్తి ప్రక్రియను వివరించేవారు. అయితే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మన శరీరంలో వైరస్ వృద్ధి చెందే ప్రక్రియ మొత్తాన్ని 3డీ సినిమాగా రూపొందించి ఓ అరుదైన ఘనతను సాధించారు.
విస్కిన్సన్-మిల్వాకీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వైరస్‌పై పరిశోధనలు జరిపి అవి మానవ కణాలపై దాడి చేస్తున్నప్పటి నుంచి కణంలోని ఇతర పదార్థాలను నాశనం చేయడం, వాటి సంతతిని వృద్ధి చెందించుకోవడం తదితర పరిణామాలను అన్నింటినీ ఎక్స్-రే ఫ్రీ ఎలక్ట్రాన్ లేజర్ కెమెరా సాయంతో కోట్ల సంఖ్యలో ఫొటోలు తీశారు. వాటన్నింటినీ వీడియోగా మార్చడానికి గణితంలోని జియోమెట్రీ, గ్రాఫ్‌థియరీ, ఫిజిక్స్‌లోని పలు సూత్రాలను సంకలనం చేసి శక్తిమంతమైన ఆల్గారిథమ్స్‌ను రూపొందించారు. దీని సహాయంతో ఫొటోలన్నింటినీ వీడియోగా మార్చి 3డీ రూపంలోకి తీసుకొచ్చారు. మేం రూపొందించిన ఈ విధానంతో వైరస్ తన రూపాన్ని ఎలా మార్చుకుంటున్నదో గుర్తించవచ్చు.
ఇది వైరల్ వ్యాధుల అధ్యయనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోవైపు శరీరంపై వైరస్ దాడిచేసినప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడం ద్వారా చికిత్స అందించడం సులభం అవుతుంది అని పరిశోధక బృంద సభ్యుడు అబ్బాస్ పేర్కొన్నారు. వీరి పరిశోధన వ్యాసం నేచర్ మెథడ్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com