అమృతం.. అటవీ ఫలం!

- April 27, 2015 , by Maagulf
అమృతం.. అటవీ ఫలం!

వేసవిలో అడవుల్లో లభించే పండ్లు, గిరిజనుల పాలిట అమృత ఫలాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయా పండ్లు, కాయలు అడవిబిడ్డలకు ఉపాధి చూపడమే కాదు, వారి ఆరోగ్యరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అడవుల్లో ఈ సీజన్‌లో తునికి పండ్లు, ఎలక్కాయలు, పాల పండ్లు, మొర్రి పండ్లు, ఇప్పపువ్వు పుష్కలంగా దొరుకుతాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉండడం వల్ల గిరాకీ కూడా ఎక్కువే. అందువల్ల గిరిజనులు వీటి సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మారుమూల ప్రాంతమైన గ్రామాల్లోని గిరిజనులు తెల్లారింది మొదలు చిన్నా, పెద్దా తేడా లేకుండా అటవీ ఉత్పత్తుల సేకరణకు బయలుదేరుతారు. పట్టణ, మండల ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఉదయాన్నే అడవికి వెళ్లి సాయంత్రం వరకు కష్టపడి సేకరించి, తునికిపండ్లు, పాలపండ్లు, మొర్రిపండ్లను కిలోకు రూ.50 చొప్పున, ఇప్పపువ్వును కిలో రూ.20కి, ఒక్కో ఎలక్కాయను రూ.5కు ఒకటి చొప్పున విక్రయిస్తారు. చలువకు తునికి పండ్లు.. తునికి చెట్టు గిరిజనులకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మొదట తునికాకు సేకరణ ద్వారా ఉపాధి పొందుతారు. ఆ సీజన్ అయిపోగానే పండ్లు చేతికొస్తాయి. ఇవి చలువ కావడం, పోషకాలు కూడా విరివిగా ఉండడంతో పట్టణాల్లో మంచి గిరాకీ ఉంటున్నది. పందిళ్ల మీది పొరక కోసం ఉపయోగపడే పాలచెట్లు కూడా వేసవిలో పండ్లను ఇస్తాయి. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఎలక్కాయల సంగతి సరేసరి. ఇప్పపువ్వును ఆయుర్వేదంలోనూ వాడుతారు. ఇప్పపువ్వును ఉదయం పూటే సేకరించాలి. వీటిని పచ్చిగా తినడమే కాక, సారాయి కాచుకొని తాగుతారు.ఇక జీర్ణశక్తిని పెంచే మొర్రిపండ్లకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. కానీ తరతరాలుగా కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం వీరికి దక్కడం లేదు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com