తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా...

- August 28, 2017 , by Maagulf
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా...

సాహిత్యం చరిత్రకు రుజువులు సిద్ధపరుస్తుంది. చరిత్ర గోత్రాలు సాహిత్యంలో దొరుకుతాయి. 1897లో ప్రచురితమయిన గురజాడ 'కన్యాశుల్కం' -ఈనాటి పరిణా మాలకు ప్రారంభ సూచికలని అందజేస్తుంది. గిరీశం వెంకటేశంతో కలిసి వాళ్ల ఊరు వచ్చినప్పుడు అగ్నిహోత్రా వధాన్లు భార్య వెంకమ్మ ''బాబూ -యేదీ, మా అబ్బాయీ మీరొక్క పర్యాయం ఇంగిలీషు మాట్లాడండి బాబూ'' అని అడుగుతుంది. పర్యవసానం 'ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌..' అంటూ చేసిన మోసం. ఇంగిలీషు మోజు అప్పటికే ప్రారంభమయిపోయిన రోజులు. వీళ్లని నోరెళ్లబెట్టి చూస్తు న్న మరో కుర్రాడు -కరటక శాస్త్రి శిష్యుడు -''మృగా ప్రియాళు దృమమంజరీణాం'' ఎవడిక్కావాలి -యీ చదువిక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర నాలుగు ఇంగిలీషు ముక్కలు నేర్చుకుంటాను -అని ఉవ్విళ్లూరిపోతాడు. ఎందుకు ఇంగ్లీషు మీద మోజు? కొత్త ఒక వింత అని మాత్రమే కాదు. కుంపిణీ వారు (ఇస్టిండియా కంపెనీ) మన దేశంలో కాలుమోపి అప్పటికే 130 సంవత్సరాల యింది. నిలదొక్కుకుని -వారి పాలన, వారి విధానాలు, వాటి ప్రభావం పల్లె పల్లెకీ ప్రాకడానికి చాలా సమయం పట్టింది. అంతకు ముందున్న వృత్తులు మారిపోయాయి. ఉద్యోగాలు మనవారికి తెలియవు. గ్రామం ఒక సమిష్టి జీవన కుటుంబంగానే ఉండేది -వాటిలో లోటుపాట్లు ఎలా వున్నా. చదువులు, ఉద్యోగాలు, బోనస్‌లూ, జీతాలూ, ప్రమోషన్లు -యిలాంటివి కొత్త. మించి -జన జీవనాన్ని ప్రభావితం చేసే ఎన్నో మార్పులు -దొరల పద్ధతులు వచ్చా యి. (అవి ఎన్నో మేళ్లనూ చేశాయి. మనం చర్చించేది మార్పు కనుక ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం) మారిపోతున్న సామాజిక, ఆర్థిక వ్యవస్థలో తెలుగు, సంస్కృతం చదువులు వెనకబడి ఇంగ్లీషు చదువు అవసరం, తత్కారణంగా దానిపట్ల మోజు గ్రామాలలో స్థిరపడుతున్న -తొలిరోజులవి. ఇంగ్లీషు వచ్చిన కారణం గానే అగ్నిహోత్రావధాన్లు గిరీశాన్ని తన ఇంట్లో ఉండనిచ్చాడు. కారణం? ''డబ్బు కానీ ఖర్చులేకుండా వీడిచేత కాగితం ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను'' అనుకున్నాడు స్పష్టంగా. ఏమిటా కాగితం ముక్కలు? కోర్టు కాగితాలు. అప్పటికే కోర్టు వ్యవహారాల్లో ఇంగ్లీషు అవసరమూ, తప్పనిసరికావడమూ మొదలయింది. అంత కుముందు చదువులంటే -మళ్లీ అగ్నిహోత్రావధాన్లు మాటల్లోనే 'కానీ ఖర్చు లేకుండా గురువుగారి ముఖత: వే దం నేర్చుకో వడం'. దానివల్ల ఉపయోగం? ఇది ముఖ్యం -చదువు ఉపయోగానికి, వినియోగానికి, ఉద్యోగానికి, సంపాదనకి, జీవనాన్ని మరింత సుఖమయం చేసుకోడా నికి, ఆస్తులు పెంచుకోడానికి కానేకాదు. ఆ రోజుల్లో చదువుకీ, వీటికీ ఏమీ సంబంధం లేదు. విద్య ఉపాధికి కాదు. విజ్ఞానం అమ్ముకోడానికి కాదు. వికాసానికి. ధర్మాన్ని నిలుపుకో డానికి. సరే.ఇంగ్లీషు పరిపాలనలో కోర్టు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులో నడవడం ప్రారంభమయి చాలా రోజులయిం ది అప్పటికే. కోర్టు వ్యాజ్యాలకి ఆస్తులు తగలెట్టుకోవడం, వాటి పద్ధతులు తెలియని -ఇంగ్లీషు రాని వాళ్లని -ఏ కాస్తో ఇంగ్లీషు వచ్చినవారు నంచుకు తినడం ప్రారంభమయి పోయింది. 'కన్యాశుల్కం' నాటకమం తా వెధ్వల్‌ (కోర్టులు), ప్లీడర్లు, కోర్టు కేసులు, సాక్షులు, దావాలు -యిదే వ్యవహారం.''నాకు ఇంగ్లీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది'' అని వాపోతాడు అగ్నిహోత్రావధాన్లు.''మీకే ఇంగ్లీషు వొస్తే భాష్యం అయ్యంగార్లా అయిపో రా?'' అంటాడు గిరీశం. ఎవరా భాష్యం అయ్యంగారు? అప్పటికి పేరు మోసిన న్యాయవాది -సంయుక్త మద్రాసు రాష్ట్రంలో. జనజీవనాన్ని 'ప్రయోజనం' పెట్టుబడిగా, ఆవశ్యకత మూలకారణంగా -ఉపాధికోసం, ఉద్యోగాల కోసం కొత్త చదువుల అవసరం, గిరాకీ, మోజు, నేర్చుకో వాలన్న ఆర్తీ పెరిగింది -మరో అడుగు ముందుకువేసి అర్థం చేసుకుంటే -నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.అంటే -మనకి తెలిసి -116 సంవత్సరాల కిందట ఆనాటి జనజీవనానికి ఇంగ్లీషు పునాది అవుతున్న రోజులు. నిస్సహాయంగా ప్రతీవాడూ తనకి తెలియని భాష వేపు తను ఆశించే జీవనానికి అర్రులు చాస్తున్న రోజులు.
సాంకేతిక, శాస్త్రీయ వ్యాపార రంగాల్లో ఇప్పటికీ ఒక్క ఇంగ్లీషు చదువే అవకాశాల్ని కల్పించే కల్పతరువు. పిల్లలకి ఇంగ్లీషు చదువులు చెప్పించాలి. తమ లక్ష్యాల దిశగా పిల్లల్ని నడిపారు. ఎందరో మెట్లన్నీ ఎక్కి అంతర్జాతీయంగా తమ సత్తాని చాటారు. భారతీయ శాస్త్రరంగంలో అంతర్జాతీయ స్థాయికి చేరిన యలమర్తి నాయుడమ్మ ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సామాజిక ప్రగతికి తన వృత్తిని అంకితం చేసిన డాక్టర్‌ సదాశివరావు వంటివారు ఎందరో ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. మరో గొప్ప ఉదాహరణ. రెండున్నర ఎకరాల కుటుంబం నుంచి వచ్చి నిమ్మకూరు నుంచి సైకిలు మీద పాలు విజయవాడకి తెచ్చి ఇళ్లకీ, హోటళ్లకీ పోసి చదువుకున్న మరొక ఆసామీ ఉన్నారు. ఆయన పేరు నందమూరి తారక రామారావు.సంకెళ్లు తెగిపోయాయి. వేదాన్ని నమ్ముకున్న కుటుంబాలూ ఉద్యోగాలవేపు పిల్లల్ని మళ్లించాయి. తరతరాల బడుగు జీవితాల నుంచి విడివడే ముమ్మరంలో ఎవ్వరూ ఏ బిడ్డ ఆలోచనలకీ తావివ్వలేదు. ఆనాడు ఆర్థిక వికాసానికే ప్రాధాన్యం. పిల్లల్ని మంచి జీవితం వేపు తరిమే పెద్దల -చదువుల కొనుగోళ్లు. అందుకే -చదువుల్లో సరదాలు పోయాయి. పోటీలు, డిప్రెషన్లు, ఆత్మహత్యలూ -ఇదో కొత్త దశ. అయితే యిదొక ఉద్యమం. ఆ కుటుంబాల పరంగా చూసినప్పుడు సంకెళ్లు తెంచుకున్న ఆవేశంలో దారితప్పిన కొన్ని ఉదాహరణలు. అదొక వెల్లువ. ఇందులో -ఈ తరం కుటుంబాలు చెల్లించిన మూల్యం -భాష, తెలుగుదనం. సమాజం చెల్లించిన మూల్యం -బ్రెయిన్‌ డ్రెయిన్‌. చదువులు మన దేశంలో, ఫలితం మరొక దేశంలో.ఇప్పుడిప్పుడు -ఇది పరిణామం కాదు. అప్పుడు వందల డాక్టర్లు వెళ్లారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. అప్పుడది మార్పు. ఇప్పుడు? మంచి జీవితానికి అర్రులు. తన కొడుకు బాగుపడాలి. అంటే ఏం కావాలి? ఫస్టుక్లాసు రావాలి. 98 శాతం మార్కులు రావాలి. అమెరికా ఉద్యోగం రావాలి. లక్షలు సంపాదించాలి. మరొక ముఖ్య కారణం -నానాటికీ చెదలు పట్టి, అవినీతితో కుళ్లిపోతున్న ఈ వ్యవస్థ నుంచి విముక్తి. అతినేలబారు జీవితం గడిపిన ఓ రైతు కొడుకు -లేదా ఓ మామూలు కులవృత్తి చేసుకుంటున్న వ్యక్తి కొడుకు -అమెరికాలో అనూహ్యమైన కొత్త జీవన ప్రణాళికని ఏర్పరుచుకుంటాడు. కారు, తన యిల్లు, పరిశుభ్రమయిన జీవితం, కంపుకొట్టే నీచపు రాజకీయాలు లేని వ్యవస్థ. సంపాదించే ప్రతీ డాలరూ ఇక్కడ 50 రెట్లు ఫలితాన్నిస్తుంది. చేసిన కృషి -ఏనాడూ ఎరగని తన తల్లిదండ్రులకి సుఖాన్ని కొనిపెడుతుంది. అతను భాష తగలడిపోతోందని గింజుకునే తెలుగువాడు కాదు. తరాల దాస్యం నుంచి ఈ తరంలోనే బయటపడి వెలుగు చూస్తున్న వాస్తవాన్ని ఎరిగిన మనిషి. తన తమ్ముడికి చదువు చెప్పిస్తున్నాడు. చెల్లెలికి పెళ్లి చేస్తున్నాడు. తల్లి జబ్బుకి వైద్యం చేయిస్తున్నాడు. ఆ దేశపు చట్టానికి వొదిగి -ఎవరి ప్రమేయం లేకుండా హాయిగా బతుకుతున్నాడు. ఇక్కడ ఆధార్‌ కార్డుకి లంచం. పన్ను కట్టడానికి లంచం. కట్టకుండా ఎగవేసే లంచం. కొడుకుని స్కూల్లో చేర్చాలంటే లంచం. బదిలీ కాగితం చేతికి రావాలంటే లంచం. ఆసుపత్రికి గుండె తణిఖీకి వెళ్లాలంటే లంచం. ఎందుకీ దరిద్రపు, కుక్కబతుకు? ఇవి నా మాటలు కావు. అక్షరాలా నేను విన్న మాటలు. నా మిత్రుడు ఓ అతి మామూలు గుమాస్తా కొడుకు, అమెరికా వెళ్లాడు. ప్రతి మూడేళ్లకీ 20 రోజులు వస్తాడు. ప్రతివారం గంట మాట్లాడుతాడు. వాడి కొడుకుకి తెలుగురాదు. నేను నా మిత్రుడి తండ్రిని అడిగాను దానికి ఆయన సమాధానం: ''నాతరంలో వాడు అనుభవించేవేవీ నేను చూడలేదు. అక్కడ వాడయినా సుఖంగా ఉంటాడు''. ఇది గొప్ప నిస్త్రాణ. ఆ సౌకర్యాలు ఇవ్వలేని ఈ దేశంలో పరిస్థితులు ఎరిగిన ఒక తండ్రి తెగింపు. (భాష, దేశభక్తి -యివన్నీ చదువులేని ఆ తల్లిదండ్రులకు తెలియని విషయాలు)
నన్ను బాగా ప్రభావితం చేసిన గొల్లపూడి మారుతీ రావు గారి వ్యాసం ఇది..

--రాజేష్ వేమూరి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com