త్యాగం.. సహనం.. దైవ చింతన మేళవింపే బక్రీద్‌

- September 01, 2017 , by Maagulf
త్యాగం.. సహనం.. దైవ చింతన మేళవింపే బక్రీద్‌

జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా మనం విశ్వసించిన దేవుడినే నమ్మాలని, కష్టాల్లోను త్యాగం, సహనం, ఆరాధించే తత్వాన్ని విడనాడకూడదని బక్రీద్‌ పండుగ సర్వ మానవాళికి బోదిస్తుంది. 'ఈద్‌ ఉల్‌ జుహా' లేదా 'ఈద్‌ ఉల్‌ అజా' అని కూడా పిలిచే ఈ పండుగను మన దేశ ముస్లీంలు శనివారం  జరుపుకోనున్నారు. ముస్లీంలు విశ్వసించే హిజ్రి క్యాలెండర్‌ ప్రకారం ఆఖరు మాసమైన ఈ పండుగ చరిత్రాత్మక కథనం నేటి ముస్లీంలకు ఎంతో స్పూర్తిని, త్యాగాన్ని బోధిస్తుంది.
ముస్లీంల పవిత్ర గ్రంధం ఖురాన్‌ ప్రకారం..నిరంతరం దైవచింతన గల ఇబ్రహీం ప్రవక్తను 'అల్లా' చాలా రకాలుగా పరీక్షిస్తాడు.  ఆయన ఆశీర్వాదంతో ఇబ్రహీం ప్రవక్త తన 80 ఏళ్ల వయస్సులో ఇస్మయిల్‌ జన్మిస్తాడు. వృద్ధాప్యంలో పుట్టిన శిశువును అల్లారుముద్దుగా పెంచుతుండగా ఓ రోజు ఇబ్రహీం ప్రవక్తకు నీకు అత్యంత ప్రీతివంతమైన జీవిని  నాకోసం కుర్బానీ (త్యాగం) ఇవ్వమని అల్లా కలలో కోరుతాడు. తన వద్ద గల ఒంటెల మంద నుంచి ఇష్టమైన ఓ  ఒంటెను కుర్బానీ ఇవ్వగా మరుసటి రోజు తిరిగి అదే కల ఇబ్రహీం ప్రవక్తకు మరలా  వస్తుంది. రెండవ రోజు మరో ఒంటెను ఆయన కుర్బానీ ఇవ్వగా తిరిగి అదే కల వస్తుంది. దాంతో తాను ఇచ్చిన కుర్బానీని అల్లా స్వీకరించలేదని తెలుసుకున్న ఇబ్రహీం ప్రవక్త తనకు ప్రపంచంలో అత్యంత ప్రీతిపాత్రమైంది తన సంతానమేనని నిర్ధారించుకుంటారు. తన కుమారుడు ఇస్మాయిల్‌ను కుర్బానీ ఇవ్వడానికి అడవి (మీన మైదానం)కి తీసుకెళుతుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతం సౌదీ అరేబియాలో ఉంది. మార్గంలో మూడు వేరువేరు మానవ రూపాల్లో వచ్చిన సైతాన్‌ (పిశాచం) 'నీ తండ్రి నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళుతున్నాడంటూ' ఇస్మాయిల్‌కు చెబుతారు. తన తండ్రి మాటను తాను శిరసావహిస్తానని మధ్యలో మీరెవ్వరు రావద్దంటూ ఆ చిన్నారి రాళ్లతో ఆ పిశాచాలను తరిమేస్తాడు. (హజ్‌ యాత్రలో ఇప్పటికీ రాళ్లు రువ్వుతారు) ఆ తరువాత కొండపైకి తీసుకెళ్లి తన కుమారుడిని బలి (ఖుర్బానీ) ఇవ్వడానికి బలియాగం సిద్ధం చేసి ఇస్మాయిల్‌ మెడపై కత్తితో తెగ నరికేందుకు సిద్ధమవుతుండగా అల్లా ఇబ్రాహీం ప్రవక్తకు తనపై గల విశ్వాసానికి  సంతోషించి ఇస్మాయిల్‌ స్థానంలో గొర్రె పొట్టేలును స్వర్గం నుంచి పంపి ఆ సమీపంలో ముళ్లపొదల్లో చిక్కుకొని ఉండేలా అల్లా  పంపిస్తారు. అ గొర్రెను ఖుర్బానీ ఇచ్చిన తరువాత ఇక నుంచి ప్రతి జుల్‌ హజ్జా నెలలో ఇలా చేయాలని అల్లా ఆదేశించారు. అప్పటి నుంచి ఈ పండుగ వాడుకలోకి వచ్చిందని మత పెద్దలు అంటారు.
ఇస్లాం మతానికి అత్యంత కీలకమైన ఇబ్రహీం ప్రవక్త అల్లా నుంచి ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. ఆయన పాదముద్రలు ముస్లీంలకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరం (కాబా)లో నేటికి ఉన్నాయి. అల్లా ఆదేశానుసారం తన భార్య హాజెరా వృద్ధాప్యంలో జన్మించిన ఇస్మాయిల్‌ ఇరువురిని అడవిలో వదిలేసి వస్తారు. అడవిలో మూడు రోజుల అనంతరం పసిబాలుడు ఇస్మాయిల్‌కు బాగా దప్పికై ఏడుస్తుంటే నీళ్లకోసం ఆయన తల్లి సఫా, మర్వా అనే రెండు పర్వతాల మధ్యకు  పరుగులు తీస్తుంది. అయినా నీళ్లు లభించకపోగా దప్పికతో విలవిల్లాడిన ఇస్మాయిల్‌ కాళ్లు నేలకేసి రాకితే అక్కడి నుంచి నీళ్లు విరజిమ్ముతాయి. ఈ నీళ్ల ప్రవాహం వేగంగా ఉండడంతో 'అల్లా' జమ్‌జమ్‌ (మెల్లమెల్లగా) అని ఆదేశిస్తే ఆ ప్రవాహం తగ్గుతుంది. నేటికి ఆ నీళ్లు అక్కడ వస్తుండగా హజ్‌కు వెళ్లిన ప్రతివారు వీటినే వాడుతారు. ఆ తల్లి హాజెరా మాదిరిగానే హజ్‌ యాత్రికులు ఇప్పటికీ సఫా, మర్వా పర్వతాల మధ్య పరుగులు తీస్తారు.
ఖుర్బానీ ఎవరివ్వాలి...?
ఎవరి వద్ద అయితే 7.5తులాల బంగారం లేదా 52.5తులాల వెండి లేదా దానికి సరిపడ్డ డబ్బులు (బ్యాంకులో అయినా) ఉన్నాయంటే అతను ఖుర్బానీ తప్పక ఇవ్వాల్సిందే. ఆ డబ్బులు లేదా సొమ్ము బక్రీద్‌ పండుగ నమాజుకు ఓ క్షణం ముందు వచ్చినా ఆ వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడానికి అర్హుడవుతాడు. యజమాని పేరుతో పాటు ఆయన కింద ఆధారపడ్డ (భార్య) పేరున ఖుర్బానీ ఇవ్వాల్సి ఉంటుంది. అల్లా కరుణ వల్ల లభించిన ఆస్తులు, మానప్రాణాలను ఆయన ఆదేశిస్తే ఎలాంటి సంకోచం లేకుండా ఆ క్షణమే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని గుర్తు చేయడానికేనని ఖుర్బానీ ఇస్తారని ముస్లీంలు విశ్వసిస్తారు. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అనే ఉన్నాయి. పరిభాషలో దైవసాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. ఖుర్బాని ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం, మాంసం అల్లాహ్‌ వద్దకు చేరవని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే అల్లాహ్‌కు చేరుతాయని ముస్లింల భావన మాత్రమే కాదు. సర్వోన్నుతుడైన అల్లా కోసం ఎటువంటి  ప్రాణత్యాగానికైనా వెనుకాడరాదని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లీంల పవిత్ర గ్రంధం ఖురాన్‌ బోధిస్తుంది.  ముస్లిం పెద్దలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం నిరుపేదలకు, ఇంకో భాగం సమీప బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచంలో లక్షలాది ముస్లింలు బక్రీద్ పండుగనాడు ఖుర్బాని ఇస్తారు. జిల్ హజ్జ నెల 11, 12 తేదీల్లో కూడా కొన్ని చోట్ల ఖుర్భాని ఇస్తూనే ఉంటారట.
ఖుర్బాని నియమాలు :
ఖుర్భాని కోసం అవయవలోపం లేని, ఆరోగ్యకరమైన ఒంటె, ఆవు, మేక లేదా గొర్రెను దైవమార్గంలో పవిత్రంగా  సమర్పించాలి. దీనిని స్థోమత కలిగిన ప్రతి ముస్లిం విధిగా ఆచరించాలి. అల్లాహ్ నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానిగా కానీ, కోడిపుంజును కానీ ఇవ్వకూడదు. ఖుర్బాని జంతువుల్లో ఐదేళ్ల వయస్సు పై బడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఆవు, కనీసం ఏడాది వయస్సున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఆవు, ఒంటెలను వ్యక్తుల తరపున, మేక, గొర్రెలను వ్యక్తి తరపున ఖుర్బాని ఇస్తారు. ఖుర్భాని వడ్డీతో కూడిన అప్పు ఇవ్వరాదు. తీసుకోరాదు. హజ్ అంటే సందర్శనా సంకల్పం. కాబాను చేరుకుని ప్రత్యేక నియమాలతో చేసే ఆరాధన. జిల్ హజ్ నెలలో 10వ తేదీన (బక్రీద్ రోజు) ఆర్థిక స్థోమత కలిగిన ముస్లింలు మక్కాలోని కాబా గృహాన్ని సందర్శించుకుంటారు. మంది యాత్రికులు మక్కా నగరానికి చేరుకుని తెల్లని దుస్తుల్లో నల్లరాతి కట్టడం కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చేయాలనుకునే ఆధ్యాత్మిక యాత్ర ఇది. ఇస్లాం ఐదు మౌలిక సూత్రాల్లో హజ్ చివరి పరిపూర్ణ సూత్రం. కాబా గృహం ప్రపంచంలో తొలి మసీదు. ముస్లింల మొదటి ఆరాధనాలయం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జిల్ నెల 8వ తేదీ 12వ తేదీ ఐదు రోజులు ప్రత్యేక నియమాలతో చేసే ఆరాధనే హజ్. ఱెకీద్ పండుగనాడు జరిగే ప్రత్యేక నమాజ్ త్వరగా అంటే అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10గంటల్లోపే చేయిస్తారు. ప్రతి ముస్లిం పండుగనాడు నమాజ్ చదవడానికి సాధ్యమైనంత వరకు ఏమీ తినకుండా వెళతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com