మద్య నియంత్రణ అమలు కై '15న చలో విజయవాడ'

- September 05, 2017 , by Maagulf
మద్య నియంత్రణ అమలు కై '15న చలో విజయవాడ'

రాష్ట్రంలో మద్య నియంత్రణ అమలు చేయాలని, జనావాసాల మధ్య మద్యం షాపులు తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మద్యవ్యతిరేక పోరాట ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. ఆ కార్యక్రమంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి పెద్దఎత్తున ప్రదర్శనగా బయలుదేరి ధర్నా చౌక్‌ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మంగళవారం విజయవాడ దాసరిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు మహిళా సంఘాలు, పార్టీ మహిళా విభాగాల నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 50 నుంచి 60 శాతం బెల్టు షాపులు మూతపడ్డాయని, తమ పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. అయితే పూర్తి స్థాయిలో బెల్టు షాపుల్ని రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జనావాసాల మధ్య ఉన్న షాపులపై అభ్యంతరాలొస్తే, వాటిని వేరే ప్రాంతానికి మార్చాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం తక్షణమే కమిటీని వేయాలని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు కొత్త మద్యం విధానాన్ని ప్రకటించాలని సూచించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధంపై ఐక్యవేదిక తరఫున ప్రచారం చేస్తున్నామన్నారు. జనావాసాల మధ్య ఉన్న షాపుల్ని తొలగించాలని ఆందోళన చేస్తున్న వారిపై షాపు యజమానులు బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ టిడిపి ఎన్నికల వాగ్దానాల ప్రకారం పూర్తిగా బెల్టు షాపుల్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపుల్ని తొలగించాలని చెబుతున్న సిఎం, ఆమేరకు దాదాపు 5 లక్షల మంది ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంచెలవారీగా మద్య నియంత్రణకు పూనుకోవాలన్నారు. అలాగే ఒక్కో వ్యక్తికి 6 మద్యం బాటిళ్లు, 12 బీరు బాటిళ్లు అమ్మడాన్ని నిషేధించాలన్నారు.

15న చేపడుతున్న ఆందోళనలో దాదాపు 32 మహిళా, ప్రజా సంఘాల భాగస్వామ్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ మహిళా విభాగం నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకొచ్చి మూడేళ్ళవుతున్నా బెల్టు షాపుల్ని పూర్తిగా రద్దు చేయలేదన్నారు. పార్టీలకతీతంగా అన్ని మహిళా సంఘాలు ఐక్యంగా 'చలో విజయవాడ ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ మహిళలంతా ఐక్యంగా పోరాడితేనే మద్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

పిఒడబ్య్లూ నుండి రాధ, సిఎమ్‌ఎస్‌ నుంచి సిపోర తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'చలో విజయవాడ' కరపత్రాన్ని ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com