ఉన్నట్టుండి ఇరాన్ క్షిపణి ప్రయోగం

- September 23, 2017 , by Maagulf
ఉన్నట్టుండి ఇరాన్ క్షిపణి ప్రయోగం

 అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. మధ్యంతర శ్రేణికి చెందిన ఈ క్షిపణిని తాము ప్రయోగించినట్లు ఇరాన్‌ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను అక్కడి అధికారిక టీవీలో ప్రసారం చేశారు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ ప్రయోగించారో వివరాలు వెల్లడించలేదు.
ది కొర్రామ్షార్‌ శ్రేణికి చెందిన ఈ క్షిపణి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణని శుక్రవారం ఇరాన్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో ప్రదర్శించారు. ఒకటి కంటే ఎక్కువ వార్‌హెడ్స్‌ను ఈ క్షిపణి ఏకకాలంలో మోసుకెళ్లగలదు. దీంతో ఇజ్రాయెల్‌, సౌదీఅరేబియాలతో పాటు చైనా, రష్యా, యూరోప్‌, ఆఫ్రికా భారత్‌ల్లోని పలు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి.
ముందే హింట్‌ ఇచ్చిన రౌహానీ 
ఇరాన్‌ క్షిపణి పరీక్షలపై అధ్యక్షుడు రౌహానీ ముందే హింట్‌ ఇచ్చారు. నిన్న జరిగిన సైనిక కవాతులో ఆయన మాట్లాడుతూ ఇరాన్‌ తన క్షిపణి, సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటుందని చెప్పారు. అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుందని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన మర్నాడే క్షిపణిని పరీక్షించినట్లు ఇరాన్‌ వెల్లడించింది.
ఆంక్షల సడలింపును పొడిగించిన వెంటనే.. 
గత వారమే ఇరాన్‌పై ఆంక్షల సడలింపును అమెరికా మరికొన్నాళ్లు పొడిగించింది. అప్పట్లో దీనిపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఫ్రాన్స్‌ కూడా ఇటీవల ఇరాన్‌ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం ఆ దేశ అధ్యక్షుడు మాక్రోన్‌ మాట్లాడుతూ ఇరాన్‌ కూడా మరో ఉత్తరకొరియా వలే తయారవుతుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com