నేడే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే

- September 23, 2017 , by Maagulf
నేడే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఇవాళ ఇండోర్‌లో జరగనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా హ్యాట్రిక్‌తో సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ రాణిస్తుందా?

బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు... బౌలర్లు అదరగొడుతున్నారు... వెరసి ఆస్ట్రేలియాపై వరుస విజయాలతో ఆసీస్‌పై దూసుకెళుతోన్న టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లీసేన మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించడం ద్వారా కంగారూలపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. అయితే ఓపెనర్లు సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోతుండడం ఒక్కటే మైనస్‌పాయింట్‌. కెప్టెన్ కోహ్లీ ఫామ్‌ జట్టుకు అడ్వాంటేజ్‌.. బౌలింగ్‌లో మాత్రం భారత్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. పేస్‌తో పాటు స్పిన్ విభాగంలో మన బౌలర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. రెండో వన్డేలో అద్భుతమైన స్వింగ్‌తో భువనేశ్వర్ అదరగొడితే... స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. దీంతో బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. సిరీస్ విజయం పెద్ద కష్టం కాదు.

మరోవైపు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో వరుసగా రెండు వన్డేల్లోనూ చిత్తుగా ఓడిన ఆసీస్‌ ఇండోర్‌ మ్యాచ్ సవాల్‌గానే చెప్పాలి. స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న పిచ్‌పై ఫామ్‌లో లేని ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ స్మిత్ తప్పిస్తే... ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడడం లేదు. దీంతో బ్యాటింగ్ గాడిన పడితే తప్ప విజయాన్ని ఆశించడం ఆసీస్‌కు కష్టమే. ఇక బౌలర్లు నిలకడగా రాణిస్తుండడం ఒక్కటే కంగారూలకు అడ్వాంటేజ్‌. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇండోర్ పిచ్‌పై పరుగులు వచ్చినా... స్పిన్నర్లు కీలకం కానున్నారని అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com