ట్వీట్‌ చేయండి వెంటనే సమస్య పరిష్కారం ...పొందండి

- October 21, 2017 , by Maagulf
ట్వీట్‌ చేయండి వెంటనే సమస్య పరిష్కారం ...పొందండి

ప్రయాణికుల ఫిర్యాదులపై రైల్వే మంత్రి తక్షణ స్పందన 
వారం క్రితం చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళుతున్న ఒక ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పంకా పనిచేయలేదు. వెంటనే బోగీలోని ప్రయాణికుడు తన చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ తీసుకొని ట్విట్టర్‌ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్‌ చేశాడు. అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలోనే విజయవాడ సీనియర్‌ డీఈఈకి అక్కడి నుంచి వరప్రసాద్‌కు సమాచారం అందడంతో తక్షణమే మరమ్మత్తులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో రైలు విజయవాడ చేరుకోగానే నిమిషాల వ్యవధిలో విద్యుత్తు సిబ్బంది రైలు వద్దకు చేరుకుని పంకాకు మరమ్మత్తులు చేసి సమస్యను పరిష్కరించారు.
* నాలుగు రోజుల క్రితం విజయవాడ నాలుగో నెంబరు ఫ్లాట్‌ఫాంపై ఉన్న ఒక క్యాంటీన్‌లో బిస్కెట్‌ ప్యాకెట్‌ను వెండర్‌ ఎమ్మార్పీపై అధిక ధరకు విక్రయించాడు. వెంటనే తన జేబులో ఫోన్‌ తీసుకొని రైల్వే మంత్రికి ట్వీట్‌ చేశాడు. అక్కడి నుంచి సమాచారం అందుకున్న తక్షణమే విజయవాడ సీనియర్‌ డీసీఎం సత్యనారాయణ స్పందించి స్టాల్‌ను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
* విజయవాడ ఏడో నెంబరు ఫ్లాట్‌ఫాంపై ఇటీవలి టీ తీసుకున్న ప్రయాణికుడు కొద్దిసేపటికే వాంతులు చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే రైల్వే మంత్రికి ఫిర్యాదు చేయగా నిమిషాల వ్యవధిలోనే టీ తయారు చేసే కేంద్రాన్ని మూయించి వేసిన ఇక్కడి అధికారులు నిర్వాహకుడికి రూ. 50 వేల జరిమానా కూడా విధించారు.
రైలు ప్రయాణంలో ప్రయాణికుడికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి గతంలో ఉండేది.. ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా ప్రయాణికులకు తెలిసేదికాదు. ప్రస్తుతం కాలం మారింది. సామాజిక మాద్యమాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. నేడు సామాన్య, మధ్య తరగతి వర్గాల చేతుల్లోనూ ఆకర్షణీయ చరవాణులు ఉండడంతో సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. రైల్వే పరిధిలో ఇటువంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. గతంలో ఏ రైల్వే మంత్రీ చేయని పనిని ఏడాది క్రితం రైల్వే మంత్రిగా పనిచేసిన సురేష్‌ప్రభు హయాంలో రైలు ప్రయాణికులు సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ట్వీట్ల కోసం దిల్లీలోని రైల్‌ భవన్‌లో ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటుచేసి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. రైలు ప్రయాణికుల సమస్యలను నిమిషాల వ్యవధిలోనే పరిష్కరిస్తూ రైల్వే మంత్రి ప్రయాణికుల ఆదరణ పొందుతున్నారు.
మీరూ ట్వీట్‌ చేయొచ్చు.. 
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌లో ట్విట్టర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రైల్వే మినిస్టర్‌ అని టైప్‌ చేస్తే రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చిత్రంతో సైట్‌ తెరుచుకుంటుంది. ప్రయాణికులు తమ తమ భాషల్లో సైతం నేరుగా సమస్యను మంత్రికి ట్వీట్‌ రూపంలో తెలియపరచవచ్చు. ఇలా వెళ్లిని ట్వీట్‌ సందేశాన్ని సెకన్ల వ్యవధిలోనే ఆయా డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు చేరుతుంది. అర్ధరాత్రులు సైతం స్పందిస్తారు. సందేశం చేరగానే అప్రమత్తమై ప్రయాణికుల సమస్యను వెంటనే పరిష్కరించి తిరిగి రైల్వే మంత్రికి నివేదిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com