రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వివాదాస్పద ఆర్డినెన్స్ పాస్‌

- October 21, 2017 , by Maagulf
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వివాదాస్పద ఆర్డినెన్స్ పాస్‌

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరారోపిత ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించే చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాజే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 180 రోజులపాటు వారిని విచారణ చేపట్టే హక్కు ఎవరికీ ఉండదని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొంది.

ఈ మేరకు రాజస్థాన్‌ క్రిమినల్‌ చట్టం 2017కి సవరణ ద్వారా సెప్టెంబర్ 7న ఓ ఆర్డినెన్స్ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానికి ఆమోదం తెలుపుతూ రాజస్థాన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ‘‘ అవినీతితోపాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న న్యాయమూర్తులు(మాజీ అయినా సరే), ప్రజా సేవకులపై ఆయా అభియోగాలు నమోదయినప్పుడు.. వారిని విచారణ చేపట్టేందుకు వీల్లేదు. ఈ మేరకు న్యాయమూర్తిసహా ఎవరికీ కూడా విచారణకు ఆదేశించే హక్కు లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు 6 నెలలపాటు ఉపశమనం ఉంటుంది’’ అని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది.

అదే సమయంలో ఆయా అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ ఏ రూపంలో అయినా కథనాలు ప్రచురించటానికి వీల్లేదంటూ మీడియాపై ఆంక్షలు కూడా విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించింది. కాగా, ఇలాంటి చట్టం ఒకటి రూపకల్పన అవుతోందని తెలిసినప్పటి నుంచే రాజే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆరు నెలలో కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని..  ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ చట్టం సరికాదంటూ వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com