అశ్లీలత ను తొలగించేందుకు నడుంబిగించిన ఇండోనేసియా

- November 07, 2017 , by Maagulf
అశ్లీలత ను తొలగించేందుకు నడుంబిగించిన ఇండోనేసియా

జకర్తా: ఇంటర్నెట్‌లో అశ్లీల సమాచారాన్ని తొలగించేందుకు ఇండోనేసియా సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ మెసేజింగ్‌ సర్వీస్‌ వాట్సాప్‌కు హెచ్చరికలు జారీ చేయగా.. త్వరలో గూగుల్‌ సహా, ఇతర సెర్చింజిన్లకు, మేసేజింగ్‌ సర్వీసులు అందించే కంపెనీలకు సమన్లు జారీ చేయనుంది.
ముస్లిం ప్రధాన దేశమైన ఇండోనేసియాలో ఇప్పటికే ఇంటర్నెట్‌పై సెన్సార్‌ విధిస్తున్నారు. ఇక్కడ సంప్రదాయవాదులు ఎక్కువ. ఈ నేపథ్యంలో అశ్లీల సమాచారాన్ని ఇంటర్నెట్‌ నుంచి తొలగించాలని ఇండోనేసియా భావిస్తోంది. ఈ మేరకు గూగుల్‌ సహా, ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లను తమ నెట్‌వర్క్‌లో అలాంటి కంటెంట్‌ ఉండకుండా తొలగించాలని సూచించనున్నట్లు ఆ దేశ కమ్యూనికేషన్‌, సమాచార మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ శామ్యూల్‌ వ్యాఖ్యానించారు.
అంతకుముందు సోమవారం వాట్సాప్‌కు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటల్లో మెసెంజర్‌లో ఉండే అశ్లీలతతో కూడిన గ్రాఫికల్‌ ఇంటర్‌ఛేంజ్‌ ఫార్మాట్‌ (జిఫ్‌) ఇమేజులను తొలగించాలని సూచించింది. అయితే, ఎన్‌క్రిప్షన్‌ కారణంగా అది సాధ్యపడదని వాట్సాప్‌ చెప్పింది. వాట్సాప్‌లో థర్డ్‌ పార్టీ సంస్థలు ఈ సేవలు అందిస్తాయని పేర్కొంది. ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆ విషయాన్ని సూచించాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో జిఫ్‌ ఇమేజ్‌లు అందించే టెనార్‌ సంస్థ మంగళవారం అలాంటి కంటెంట్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. ఐఫోన్‌లో వాట్సాప్‌ వినియోగించే వారికి మంగళవారం ఈ తరహా జిఫ్‌లు కనిపించలేదు. తమ అభ్యర్థనకు స్పందించిన నేపథ్యంలో నిషేధాన్ని అమలు చేయబోమని డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com