అరికెల చికెన్‌ పులావ్‌

- November 12, 2017 , by Maagulf
అరికెల చికెన్‌ పులావ్‌

కోడో మిల్లెట్స్‌ను తెలుగులో అరికెలు అంటారు. దీంతో చికెన్‌ పులావ్‌ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
 
కావలసిన పదార్థాలు: చికెన్‌- 1/2 కేజి (పెద్ద ముక్కలు), కారం- 2 టేబుల్‌స్పూను, పసుపు- 1 టీస్పూను, వెల్లుల్లి పేస్టు- 1 టీస్పూను, చిటికెడు గరం మసాలా.
పులావ్‌కు కావాలసినవి: తరిగిన ఉల్లిపాయముక్కలు - 2 కప్పులు, తరిగిన టొమాటో ముక్కలు - 2 కప్పులు, కాప్పికం (పెద్దముక్కలు)- 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు-2, అల్లంవెల్లుల్లి పేస్టు- 2 టేబుల్‌స్పూన్లు, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు- 1/2 కప్పు, నెయ్యి- 2 టేబుల్‌ స్పూన్లు.
 
మసాలాకు: కారం- రెండు లేదా మూడు టేబుల్‌స్పూన్లు, పసుపు- 1 టీస్పూను, గరంమసాలాపొడి- 1 టీస్పూను, లవంగాలు-5, ఏలకులు-2, దాల్చినచెక్క- ఒకటిరెండు ముక్కలు, తులసి ఆకులు-2 లేదా 3. అరికెలు- 2 కప్పులు, నీళ్లు-4 కప్పులు
తయారీ: గంటసేపు చికెన్‌ని ఊరేయాలి. మొదట అరికెల అన్నం తయారుచేసుకోవాలి. రెండు కప్పుల అరికెలకు రెండు కప్పుల నీటిని పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. ఇందులో రెండు తులసి ఆకులు వేస్తే అన్నం మంచి సువాసన వస్తుంది. మొదట పెద్దమంట మీద ఉడికించాలి. ఒక విజిల్‌ వచ్చిన తర్వాత మంటను తగ్గించాలి. రెండవ విజిల్‌ వచ్చిన తర్వాత కుక్కర్‌ను పొయ్యిమీద నుంచి కిందకు దించాలి. కుక్కర్‌ మూత తీయకుండా పది నిమిషాలు అలాగే ఉంచితే ఆవిరితో అరికెలు మరింత బాగా ఉడుకుతాయి.
 
ఉడికిన అరికెల అన్నాన్ని పెద్ద ప్లేటులో పెట్టి చల్లారనివ్వాలి. గరిటెతో మాత్రం దాన్ని కలపొద్దు. అలా చేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది. తర్వాత లోతు ఎక్కువగా ఉన్న పాత్రలో నెయ్యి వేసి పైన పేర్కొన్న మసాలా దినుసులన్నింటినీ అందులో వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. అందులో ఉల్లిపాయముక్కల్ని, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించాలి. తరిగిపెట్టుకున్న టొమాటో ముక్కలతో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి. తరువాత ఎర్రమిరపకాయలు, గరం మసాలా వేసి చిన్న మంటపై ఒకటి రెండు నిమిషాలు వేయించాలి. దీంట్లో పచ్చిమిరపకాయముక్కలు కలపడం మర్చిపోవద్దు. ఆ తర్వాత చికెన్‌ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలపాలి. చికెన్‌ని ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అవసరపడితే కొద్దిగా నీళ్లు మాత్రమే అందులో పోయాలి. తర్వాత తరిగిపెట్టుకున్న కాప్సికం ముక్కలు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి సన్ననిమంటపై ఉడకనివ్వాలి. తర్వాత చల్లారిన అరికెల అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి కాసేపు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. అంతే...అరికెల చికెన్‌ పలావ్‌ రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com