దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఘరానా మోసం

- November 21, 2017 , by Maagulf
దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఘరానా మోసం

హైదరాబాద్‌:మోసాల్లో ఆరితేరిన పలువురిని నిండా ముంచిన ఘరాన కి'లేడీ'పై రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పీడీ చట్టం ప్రయోగించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్‌ పట్టణం ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలోని లేబర్‌ కాలనీకి చెందిన తాటిపర్తి షీబారాణి(46) దుబాయ్‌లో ఉద్యోగం, వీసాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగుల్ని మోసం చేసింది. బియ్యం, మాంసం వ్యాపారుల్నీ వంచించినందుకు ఇప్పటికే ఈమెపై 8 కేసులు నమోదయ్యాయి. వారణాసి విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన ఆమె నగరానికి మకాం మార్చింది. 2000 సంవత్సరంలో సికింద్రాబాద్‌ చర్చిఫాదర్‌ జోయెల్‌తో పరిచయం పెంచుకుంది. దేశవ్యాప్తంగా అనాథాశ్రమాలను నడిపే అతడితో విదేశాలు తిరిగింది. 2010లో అతడు మరణించడంతో బయటికి వచ్చి బియ్యం, మాంసం వ్యాపారాల్లోకి దిగింది. ఉద్దెర ప్రాతిపదికన బియ్యం, మేకల్ని తీసుకొచ్చి వ్యాపారులకు డబ్బులివ్వకుండా సతాయించేది.

ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో మిర్యాలగూడలో ఏడాదిపాటు జైలుపాలైంది. అనంతరమూ పద్ధతి మార్చుకోని ఆమె నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసింది. మొత్తం ఏడుగురిని రూ.87.45లక్షలకు మోసం చేసింది. అలాగే జవహర్‌నగర్‌ యాప్రాల్‌లో ఉంటూ పరిసర ప్రాంతాల్లోని సంపన్నకుటుంబాల మహిళతో పరిచయం పెంచుకునేది.

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే షీబారాణి తనకు అప్పుగా డబ్బు ఇచ్చేందుకు నిరాకరించే మహిళలతో గొడవలకు దిగేది. ఈ ఫిర్యాదులతో ఈనెల 14న జవహర్‌నగర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి నాలుగు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు, నాలుగు చరవాణుల్ని స్వాధీనం చేసుకొన్నారు. గత మూడు నెలల కాలంలోనే ఆమెపై నాలుగు కేసులు నమోదు కావడంతో కమిషనర్‌ ఆమెపై మంగళవారం పీడీ చట్టం ప్రయోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com