పోలీసులకు చెమటలు పట్టిస్తున్న ఇవాంకా!

- November 26, 2017 , by Maagulf
పోలీసులకు చెమటలు పట్టిస్తున్న ఇవాంకా!

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా రాక కోసం హైదరాబాద్ ముస్తాబు అవుతోంది. ఆమెకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న విందు మెనూ సిద్ధమైంది. ఆమెకు మరపురాని ఆతిథ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకు మంత్రి కేటీఆర్ దగ్గరుండి మెనూను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పేరును షెఫ్‌లు ఈ వంటకాలను సిద్ధం చేయనున్నారు. మెనూలో ధమ్‌కా బిర్యానీ, హలీం, షీక్ కబాబ్, మటన్ మురగ్, మటన్ కోఫ్తా, మొగలాయి మటన్, మొగలాయి చికెన్, ఖుబానీ కా మీఠా, డ్రై ఫ్రూట్స్ ఖీల్, నాన్ రోటి, రుమాలి రోటీ, పరాఠా, బగారా బైగన్, రైతాలతో పాటు మరిన్ని వెరైటీలు సిద్ధం కానున్నాయి.
హైదరాబాద్ వంటలతో పాటు అమెరికన్ రుచులనూ తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని అతిపెద్ద డైనింగ్ టేబుల్‌గా పేరు తెచ్చుకున్న ఫలక్‌నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ పైన ఈ వంటకాలను ఇవాంకాతో పాటు ముఖ్యమైన అతిథులు కొందరికి వడ్డించనున్నారు.

గ్లోబల్ సమ్మిట్, మెట్రో రైలు ప్రారంభం ఒకేసారి రావడం, ప్రధాని మోడీ, ఇవాంకా ఒకేసారి వస్తుండటంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మూడు కమిషనరేట్ల పరిధుల్లో హెఅలర్ట్‌ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు వరుసగా కట్టడి ముట్టడులు నిర్వహిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోటలో గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇద్దరు వీవీఐపీలు ఉండటంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పేరుకు 2,200 మందే భద్రత విధుల్లో ఉన్నా 15 వేలమంది నగర పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు.

హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా ప్యాలెస్‌, గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు వేదికైన హెచ్‌ఐసీసీ, ప్రధానమంత్రి విందు ఇవ్వనున్న ఫలక్‌నుమా ప్యాలెస్‌పై పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సదస్సుల్లో పాల్గొనే అతిథుల రాకపోకలు, వారి సంస్థలు, పేర్లు ఇతర అంశాలను సమీక్షిస్తున్నారు.

ఇవాంకా బస చేయనున్న వెస్టిన్ హోటల్‌ భద్రత వ్యవహారాలను డీసీపీ స్థాయి అధికారికి అప్పగించారు. కేంద్ర నిఘా వర్గాలు, ఎస్పీజీ అధికారులతో సమన్వయం చేసుకుని, కమిషనరేట్‌ పరిధిలో బందోబస్తు విధులను పరిశీలిస్తున్నారు. సమయం చాలక రాత్రివేళల్లో ఆఫీస్‌లోనే ఉంటున్నారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో గంటల వ్యవధిలో రెండుసార్లు కట్టడి, ముట్టడి చేశారు. కాలనీలు, మురికివాడల్లో నివస్తున్న వారి వద్దకు వెళ్లి వేలిముద్రలు సేకరించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోటలో పొదలు, అటవీ ప్రాంతం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్‌ చేస్తున్నాయి. ఒకేసారి పది నుంచి పదిహేను బృందాలు విస్తృతంగా తనిఖీలు సాగిస్తున్నాయి.

గోల్కొండ కోటలోకి ప్రవేశించేందుకు పలు మార్గాలున్నాయన్న స్థానిక పోలీసుల సమాచారంతో కేంద్ర బలగాలు ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. హెచ్‌ఐసీసీ వద్ద రెండు వేలమంది, ఫలక్‌నుమా, గోల్కొండ కోటల వద్ద ఒక్కోచోట 1,500 మంది సాయుధ, శాంతిభద్రతల పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com