బ్రిటన్ పై ఫైర్ అయిన ట్రంప్

- November 30, 2017 , by Maagulf
బ్రిటన్ పై ఫైర్ అయిన ట్రంప్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్న మితవాదుల వీడియోలను ట్రంప్‌ రీట్వీట్‌ చేయడం సరికాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ట్రంప్‌ రీట్వీట్‌ చేసిన వీడియోలు ఓ బ్రిటన్‌ మహిళ పోస్టు చేసినవి కావడంతో.. థెరిసా విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తనపై దృష్టిపెట్టడం మాని మీ దేశంలో పేట్రేగిపోతున్న ఉగ్రవాదంపై దృష్టిపెట్టాలని ట్రంప్‌ హితవు పలికారు. బ్రిటన్‌ ఫస్ట్‌ అనే జాతీయవాద గ్రూపు డిప్యూటీ లీడర్‌ జైడా ఫ్రాన్సెస్‌ ఇటీవల తన ట్విటర్‌ ఖాతాలో మూడు వీడియోలను పోస్టు చేశారు. మొదటి ట్వీట్‌లో ఓ ముస్లిం శరణార్థి ఊతకర్ర సాయంతో నడుస్తున్న మనిషిపై దాడి చేసే దృశ్యం ఉంది. రెండో వీడియోలో ఒక వ్యక్తి వర్జిన్‌ మేరీ విగ్రహాన్ని బద్దలు కొడుతున్న దృశ్యాలుండగా.. మూడో వీడియోలో ఓ భవనంపై ఓ వ్యక్తి మరో వ్యక్తిని తోసేస్తున్న దృశ్యం ఉంది. ట్రంప్‌ చర్యను ఖండిస్తూ బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే ప్రతినిధి 'అమెరికా అధ్యక్షుడు అలా రీట్వీట్‌ చేయకుండా ఉండాల్సింది' అన్నారు.

అయితే అమెరికా మాత్రం దీనిని సమర్థించుకుంది. వైట్‌ హౌజ్‌ ప్రతినిధి సారా శాండర్స్‌.. 'ఆ వీడియో నిజమైనా కాకున్నా, ఇలాంటి ప్రమాదకరమైన అంశాలపై మే, ఇతర ప్రపంచ నేతలు చర్చించాల్సిందే' అన్నారు. ట్రంప్‌ రీట్వీట్లపై సోషల్‌ మీడియాలో అసహనం వ్యక్తమైంది.

ఉగ్రవాది చేతిలో దారుణహత్యకు గురైన బ్రిటిష్‌ ఎంపీ జో కాక్స్‌ భర్త బ్రెండన్‌ కాక్స్‌.. ట్రంప్‌ రీట్వీట్లను ఖండించారు. టీవీ ప్రెజెంటర్‌, జర్నలిస్ట్‌ పియర్స్‌ మోర్గాన్‌, 'ఈ పిచ్చితనాన్ని ఆపి, రీట్వీట్లను వెనక్కి తీసుకోండి' అని సూచించారు. అమెరికా పౌర హక్కుల బృందం 'కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్‌-ఇస్లామిక్‌ రిలేషన్స్‌', అమెరికా అధ్యక్షుడి నుంచి ఇలాంటి చర్యలను ఆశించలేమని పేర్కొంది.

ట్రంప్‌ పోస్ట్‌లు అమెరికా ముస్లింలపై హింసకు పురిగొల్పేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com