ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం..

- December 12, 2017 , by Maagulf
ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడతలో చక్రం తిప్పేందుకు ప్రధాని మోడీ, రాహుల్ బిజీబిజీగా ప్రచారాలు నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా మోడీ సీ ప్లేన్‌లో సబర్మతి నదిలో విహరించి వినూత్న ప్రచారం నిర్వహించారు. అటు బీజేపీ పాలనలో గుజరాత్ వెనకబడిందంటూ రాహుల్ నిప్పులు చెరిగారు.

గుజరాత్ లో పార్టీల మైకులన్నీ మూగబోయాయి. చివరి క్షణం వరకూ ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ప్రచారాల్లో మునిగి తేలారు. మోడీ సీ ప్లేన్‌లో ప్రయాణించి వినూత్నంగా ప్రచారంలో పాల్గొన్నారు. అటు రాహుల్ కూడా అహ్మదాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారాలు చేశారు. గుజరాత్ వెనుకబాటు తనానికి మోడీయే కారణమంటూ దుమ్మెత్తిపోశారు. 

గుజరాత్‌లో 93 స్థానాలకు ఈనెల 14న రెండో విడత పోలింగ్‌ జరగనుంది. తొలి విడతలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 68శాతం పోలింగ్‌ నమోదవడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రెండో దశ ఎన్నికలు కమలం పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, మెహసానా, బనస్కాంత ప్రాంతాల్లో బీజేపీకి పట్టుంది. ఇక్కడ బలం నిలుపుకొంటే ఆధిక్యత సాధించవచ్చన్న నమ్మకంతో మోడీ ప్రచారాలు కొనసాగాయి. 

అహ్మదాబాద్‌లో 21 నియోజకవర్గాలు.. గాంధీనగర్‌లో 5.. బనస్కాంతలో 9.. మెహసానాలో 7 నియోజక వర్గాలున్నాయి. 22 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలనుకుంటోంది. మోడీ-షాల కోటను బద్దలుకొట్టి.. దశాబ్దాలుగా దూరమైన అధికార దండం అందుకోవాలని కాంగ్రెస్‌ ఆశ పడుతోంది. పైగా రాహుల్‌గాంధీ ఈనెల 16న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం తర్వాత తొలి విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 18న వెలువడనున్నాయి. దీంతో గెలుపెవరిదన్నది ఉత్కంఠగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com