ఎమ్మెల్యే రేసులో ఎంపీలు..బాబుకు కొత్త టెన్షన్‌

- December 19, 2017 , by Maagulf
ఎమ్మెల్యే రేసులో ఎంపీలు..బాబుకు కొత్త టెన్షన్‌

మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎంపీలకు ఆ పదవి అంటేనే మొహం మొత్తేసినట్టు ఉంది. ఎవరో ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్న కొందరు ఎంపీలు తప్పా చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడంతో పాటు మంత్రి పదవులు చేపట్టడం, స్థానికంగా పాపులర్ అవ్వాలనే కలలు కంటున్నారు. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తమ ఎంపీ సీట్లను వదిలేసుకుని ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు చెందిన పలువురు సీనియర్‌, జూనియర్ ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేసేందుకే ట్రై చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా అధికార టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురు నుంచి ఆరుగురు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. అంతేగాక ఎమ్మెల్యే అయిపోయి.. మంత్రి పదవిలో కూర్చోవాలని తహతహలాడుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పాజిటివ్ వేవ్ ఉందని భావిస్తోన్న కొందరు సీనియర్ ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి పదవి చేపట్టాలని ప్రయత్నాల్లో ఉన్నారు.మరికొందరు మాత్రం స్థానిక రాజకీయాల్లో పట్టు కోసం ట్రై చేస్తున్నారు.

ఈ జాబితాలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప - ఏలూరు ఎంపీ మాగంటి బాబు - కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు - శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నట్టు సమాచారం. వీరితో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తదితరుల పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వచ్చే ఎన్నికల్లో పెనుగొండ లేదా పుట్టపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి అవ్వాలన్న ప్లాన్‌తోనే ఆయన అసెంబ్లీకి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్టేట్‌లో చక్రం తిప్పాలన్న ప్లాన్‌తో ఈ సారి విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు.

మాగంటి బాబు ఈ సారి కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే ఆయన అసెంబ్లీ బరిలో ఉంటున్నారని ఏలూరు టాక్‌. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు నరసన్నపేట అసెంబ్లీ రేసులో ముందు వినిపించినా, ఆయన జాతీయ రాజకీయాల్లోనే ఉండేందుకు ఇష్టపడడంతో మరోసారి ఎంపీగానే పోటీ చేయనున్నారు.

ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఆయన సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి రేసులో నిన్నటి మొన్న వరకు ఉంది. అయితే ఆయన కూడా తాను మరోసారి పార్లమెంటుకే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండడంతో వీరు కన్నేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. వీరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో బాబుకు కూడా సరికొత్త చిక్కులు తప్పవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com