క్రిస్మస్ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?

- December 24, 2017 , by Maagulf
క్రిస్మస్ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?

రకరకాల బహుమతులు.. బొమ్మలు.. కేకులతో.. క్రిస్‌మస్‌ పండుగ చేసుకుంటున్నారు కదా! మరి క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా? శాంతాక్లాజ్‌ తాతయ్య ఎవరో తెలుసా? ఆ కథలేంటో తెలుసుకుందామా! 

వరాలిచ్చే చెట్టు! --క్రిస్మస్‌ నాడు చెట్లను అందంగా అలంకరిస్తారు కదా, మరి ఆ అలవాటు ఎలా మొదలైందో తెలుసా? దాని వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టిన రోజున చర్చికి వెళ్లి రకరకాల బహుమతులను క్రీస్తుకు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడికి పాపం... ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో సెంటు కూడా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబోకి తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన అందరూ ప్లాబో కానుక చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూ దానిని బాల ఏసు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యం...! వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకనే జీసెస్‌ స్వీకరించాడని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టుని అలంకరిస్తున్నారు. 

ఇలాంటిదే మరో కథ కూడా ఉంది. 
చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తోంది. చిన్న పాకలో అన్న వాలంటైన్‌, చెల్లి మేరీ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా తిని రెండు రోజులైంది. నీర్సంగా ఉన్నారు. ఇంతలో నాన్న వచ్చాడు. చేతిలో రొట్టెముక్క! దాన్నే మూడు భాగాలు చేసుకుని ప్రార్థన చేయసాగారు. 'ఓ జీసస్‌ మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్లందరీ కడుపు నింపు'. ప్రార్థన తర్వాత తినబోతుండగా తలుపు చప్పుడైంది. తీసి చూస్తే ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ 'ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?అని అడిగాడు.లోపలికి రమ్మన్నారు.'తిని నాలుగు రోజులైందీ' అన్నాడా పిల్లాడు దీనంగా.తమ రొట్టె ఇచ్చి, రగ్గు కప్పి పడుకోబెట్టారు.అతడి ఆకలి తీర్చగలిగామన్న తృప్తి తో వాళ్ళు నిద్రపోయారు.అర్ధరాత్రి అన్నాచెల్లిల్లిద్దరికి మెలకువ వచ్చింది.పైన మిలమిలలాడే నక్షత్రాలు. ఎగురుతున్న దేవదూతలు. వాళ్లింటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు బాలఏసు.వాళ్లింట బయట ఎండిన కొమ్మని నాటాడు.అది చూస్తుండగానే చిగురించి పెద్దదైంది.దాన్నిండా బంగారు యాపిల్ కాయలు! అదే మొట్టమొదటి క్రిస్మస్ చెట్టు.

**ప్రపంచంలో అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో ఓ హోటల్లో. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లు. ఈచెట్టుని 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్ళతో అలంకరించారు.

**క్రిస్మస్ చెట్టు మొదటిసారిగా అలంకరించినది 1510లో. ఇళ్ళల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో.

**అమెరిజాలో ఏటా మూడుకోట్ల క్రిస్మస్ చెట్లు అమ్ముడవుతాయి.పది లక్షల ఎకరాలో  వీటిని పెంచుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com