రాజ్ భవన్ విందులో చంద్రుల మంత్రాంగం
- December 24, 2017
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లి నియోజకవర్గాలు పెరిగి తీరుతాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖతతో ఉందని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాంతీయ పార్టీల మద్దతు లేనిదే వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగలేమన్న అభిప్రాయాన్ని బీజేపీ అంతర్గత సమావేశాల్లో వ్యక్తపర్చారని వీరిరువురూ స్పష్టం చేశారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గౌరవార్థం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందుకు ఇరువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పరస్పర ఆత్మీయ పలకరింపులు.. కరచాలనాలు.. అనంతరం కేసీఆర్, చంద్రబాబులు కాస్త దూరంగా వెళ్లి ఏకాంతంగా దాదాపు 20 నిమిషాలకు పైగా మంతనాలు జరిపారు. వీరిరువురి మధ్య అసెంబ్లి నియోజకవర్గాల పెంపు, విభజన సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, ఇటీవల ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచేందుకు మొదట్లో కేంద్ర ప్రభుత్వం అనాసక్తి కనబర్చినా గుజరాత్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చిందని ఇద్దరు సీఎంల చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలు పెరగకపోతే రాజకీయంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని, ఇదే విషయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చంద్రబాబు అన్నారు. తాను కూడా ఈ అంశంపై ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో ప్రస్తావించానని కేసీఆర్ తెలిపారు. విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచుతామన్న హామీ ఉందని.. అయితే, వీటిని పెంచేందుకు రాజ్యాంగాన్ని సవరించాలన్న అంశాన్ని తరచూ కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోందని ముఖ్యమంత్రులు తమ చర్చల సంద ర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది పూర్తవుతుందని తద్వారా నియోజకవర్గాలు పెరుగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి కూడా తీసుకువెళ్లానని, ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రధాని కార్యా లయానికి పంపించినట్లు ఆయన తనను కలిసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలకు చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నియోజకవర్గాలను పెంచా లన్న ప్రతిపాదనకు కాస్త విము ఖత వ్యక్తపరుస్తున్నారని, మరి ఆయన ఆ వైఖరితో ఎందుకు ఉన్నారో.. అర్థం కావ డం లేదని కేసీఆర్ అన్నట్లు సమాచారం. సుదీర్ఘంగా గుజరాత్‌లో అధికా రాన్ని చెలాయించిన బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిందని 15 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, ఈ నియోజకవర్గాల్లో ఓటర్లు బలంగా తీర్పు ఇచ్చి ఉంటే బీజేపీకి ఇబ్బందులు ఎదు రయ్యేవని ఇరువురు సీఎంలు మాటల సందర్భంగా చర్చిం చుకున్నట్లు తెలుస్తోంది.
వివాదం లేని విభజన సమస్యలను పరిష్కరించు కుందామని ఇప్పటికే సమస్యలపై గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం జరిగినా ఫలితం లేకపోయిందని చంద్రబాబు అన్నట్లు సమాచారం. ఈ సమస్యలు కేంద్రం దృష్టికి వెళితే ఇప్పట్లో పరిష్కారం కావని.. అందుకే సుహృద్భావ వాతావరణంలో వీటిపై కలిసి కూర్చుని పరిష్కరించుకుందామని కేసీఆర్‌కు చంద్రబాబు సూచించి నట్లు తెలుస్తోంది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎక్కడికక్కడ నిధులు ఆగిపోయాయని.. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు సాగడం లేదన్న అభిప్రాయం సీఎంల చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగా అధికారులను సమావేశపర్చి సమస్యలను చర్చించు కుందామని ఈ విషయంలో ఇంకెంతమాత్రం జాప్యం జరగ కుండా ముందుకు వెళితే బాగుంటుందనే అభిప్రాయం ఇరు వురు మధ్య వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతి కేంద్రంగా పరిపాలన ఆశించిన దానికన్నా మిన్నగా సాగుతోం దని, త్వరలోనే రాజధానికి సంబంధించిన శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని చంద్రబాబు చెప్పా రు. భవనాలకు సంబంధించిన ఆకృతులు సిద్ధమయ్యా యని తొలి దశలో సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకో ర్టు వంటి భవనాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వా నిస్తున్నా మని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ భవన నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. సచి వాలయంతో పాటు అక్కడే అన్ని శాఖల అధిపతులు, ఆయా శాఖల సంచాలకులు ఉండే విధంగా భవనాలను నిర్మిస్తే బాగుంటుందని తద్వారా సమయాన్ని ఆదా చేయవచ్చని కేసీ ఆర్ చెప్పినట్లు సమాచారం. తాను కూడా నూతన సచివా లయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నానని కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇచ్చిన వెంటనే సికింద్రాబాద్‌లోని బైసన్‌పోల్ మైదానంలో సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి ముందుకు వెళతామని కేసీఆర్ అన్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయ వంతమయ్యాయని, దేశ, విదేశాల నుంచి ఐదు రోజుల పాటు సాగిన ఈ సభలకు పెద్దసంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారని కేసీఆర్ అన్నారు. నాగార్జున విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో ఈ నెల 27న అంతర్జాతీయ ఆర్థిక వేత్తల సదస్సు ప్రారంభమవుతోందని, మూడ్రోజులపాటు జరిగే ఈ సదస్సుకు నోబెల్ అవార్డు గ్రహీతలు హాజరవుతున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ ఈ సద స్సును ప్రారంభిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు వచ్చిన చంద్రబాబు నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అప్పటికే ఏపీ అసెంబ్లి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప దంపతులు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ నండూరి సాంబశివరావు తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి వచ్చారు. రాజ్‌భవన్‌కు చేరుకోగానే గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్‌లు చంద్రబాబుకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. కుటుంబసభ్యులను ఎందుకు తీసు కురాలేదని.. ఒక్కరే ఎందుకు వచ్చారని గవర్నర్ దంపతులు ప్రశ్నించగా తాను నేరుగా విజయవాడ నుంచి వస్తున్నానని చంద్రబాబు బదులిచ్చారు. పలకరింపులు, కరచాలనాలు ముగిశాక ఇరువురు ముఖ్యమంత్రులను గవర్నర్ తోడ్కొని రాజ్‌భవన్‌లోకి వెళ్లారు. రాజ్‌భవన్‌లోని కార్యాలయంలో అప్పటికే అక్కడికి చేరుకున్న రాష్ట్రపతి దంపతులను ఇరువురు సీఎంలు కలిశారు. అందరూ కలిసి తిరిగి రాజ్‌భవన్‌లోని పచ్చిక బయళ్ళలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి ఆసీనులైన కుడివైపు కేసీఆర్.. ఎడమవైపు చంద్రబాబులు కూర్చున్నారు. కాసేపటి తర్వాత ఇరువురు సీఎంలు అక్కడినుంచి లేచి కొంతదూరం నడిచివెళ్లి ఏకాం తంగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య చర్చలు ముగి శాక తిరిగి రాష్ట్రపతి కూర్చున్న ప్రాంతానికి వెళ్లి ఆసీనులయ్యే ప్రయత్నం చేస్తుండగా అక్కడే ఉన్న గవర్నర్ నరసింహన్ రెండు చేతులతో ఇద్దరు సీఎంలను తీసుకుని వెళ్లి పక్కపక్కనే కూర్చొబెట్టారు. పక్కనే ఉన్న చంద్రబాబుతో రాష్ట్రపతి కోవింద్ పది నిమిషాల పాటు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం విందు కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి కూర్చున్న సీటుకు కుడివైపున చంద్రబాబు, ఎడమ వైపున కేసీఆర్‌లు కూర్చుని విందు ఆరగించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి