మర్చిపోలేని బందర్ ప్రయాణం

- December 29, 2017 , by Maagulf
మర్చిపోలేని బందర్ ప్రయాణం

మచిలీపట్నం అనగానే ఎక్కువగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు. కృష్ణాజిల్లా ముఖ్యపట్నమైన బందరు తీరప్రాతం కావడంతో బీచ్‌లకు కొదవలేదు. అందులో చెప్పుకొదగినది మంగినపూడి బీచ్‌. ఈ బీచ్‌కి వారాంతరాల్లో అనేకమంది దూర ప్రాంతాలనుంచి వస్తుంటారు. విజయవాడకు 65 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వారం జర్నీలో సరదాగా ఆడుతూపాడుతూ బైక్‌పై బీచ్‌ వరకు వెళొద్దాం పదండి!

విజయవాడ నుంచి మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు. పొద్దున పొద్దున్నే బయలుదేరితే సరైన సమయానికి అక్కడికి చేరుకుంటాం. తెల్లవారు జామునే ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్‌ చేయకుండా రెడీ అయిపోయి, ఇద్దరం కలిసి బండెక్కి బయటపడ్డాం. అప్పుడప్పుడే సూర్యుడు మంచుతెరలను చీల్చుకుంటూ డ్యూటీ ఎక్కుతున్నాడు. మెల్లగా ఇంటి దగ్గరనుంచి విజయవాడ బందరు రోడ్డు మీదకొచ్చాం. జేబులో ఫోను తీసి, గూగుల్‌ తల్లిని రూట్‌ మాప్‌ అడిగాం. గట్టిగా 'గో స్ట్రైట్‌' అని బదులిచ్చింది. ఇక దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళిపోయాం. సిటీ పొలిమేర దాటుతుండగా తెల్లటి పొగమంచు మా చుట్టూ కమ్మేసింది. ఆ మంచు తెరల్లోంచి రోడ్డుకిరువైపులా ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ బెజవాడ దాటేశాం. ఉయ్యూరు టౌన్‌లో టిఫిన్‌ బండి దగ్గర మా బండికి బ్రేకులు పడ్డాయి. మంచి వేడి వేడి ఇడ్లీలూ, ఎగ్‌ దోశ చెరొక ప్లేటూ లాగించేసి, మళ్ళీ జర్నీ కొనసాగించాం. అప్పటికీ మంచు ఎక్కువగానే ఉంది. అయితే, పల్లె వాతారణం చలిని దూరం చేసింది.

ఎన్ని.. ఎండు చేపలో! 
ఈసారి బండి ఏకంగా మచిలీపట్నంలోనే అగింది. మావాడి ప్రాజెక్టు పనికోసం బందరు ఫిష్‌ యార్డ్‌కి వెళ్ళాం. అక్కడ వాడు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా మరో వంద మీటర్ల దూరం నుంచి ఎండు చేపలవాసన నా ముక్కును ఘాటుగా తాకింది. నాకు తెలియకుండానే నా అడుగులు అటువైపుగా పడ్డాయి. కాస్త ముందుకు వెళ్ళి చూశాం. అప్పుడే జాలర్లు కొంతమంది తెచ్చిన చేపలకి ఉప్పురాసి ఎండబెడుతున్నారు. అలా చేపలని మూడురోజులు ఎండబెడతారనే కొత్త విషయాన్ని ఆరోజే తెలుసుకున్నామన్నమాట. కుప్పలుగా పోసిన ఉప్పుచేపలు నోరూరించాయనే చెప్పాలి. అక్కడి మత్స్యకారులు గుంపులుగా వారి పనిలో నిమగం అవ్వడం చూస్తే వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం మమ్మల్ని బాగా ఆకర్షించింది. అలా మాట్లాడుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళాక ఓ గోదాం కనపడింది. అందులో అడుగుపెట్టంగానే అక్కడ ఉన్న చేపల రకాలను చూసి ఇద్దరం నోరెళ్లబెట్టి అవాక్కయ్యాం. ఇక మావాడు ఆ మత్స్యకారుల్ని, ఆ గోదాంని, ఆ షిప్‌యార్డునీ, జాలర్లనీ తన కెమెరాలో బంధించేందుకు తెగ కష్టపడ్డాడు. అలా కొన్ని ఫొటోలు తీసుకున్నాడు. మేమిద్దరమూ ఆ చేపల దగ్గర కొన్ని సెల్ఫీలూ గట్రా దిగి ఇక పోర్ట్‌ ఆఫీసు దగ్గరకెళ్లాం. అక్కడ పని పూర్తిచేసుకుని బయటపడేసరికి మధ్యాహ్నం రెండయ్యింది. ఏదైనా తిని, బీచ్‌కి వెళదామనుకుని దగ్గర్లోని రెస్టారెంటుకి వెళ్ళాం. రెండు ప్లేట్లు రొయ్యల బిర్యానీ ఆర్డరిచ్చి, తనివితీరా తిని, బరువైన పొట్టలతో బయటపడ్డాం.

మాష్టారూ దారెటు?! 
అక్కడి నుంచి బీచ్‌కి వెళ్లేందుకు దారి తెలియక మళ్ళీ గూగుల్‌ తల్లిని రూట్‌ అడిగాం. వెంటనే కొన్ని వంకర్లతో కూడిన దారి చూపించి వెళ్ళిపొమ్మంది. గూగులొచ్చాక మనుషులతో సంబంధాలే తెగిపోతున్నాయి కదా అనుకున్నాం. ఇది వరకు దారిన కనపడినవారందరినీ 'మాష్టారూ దారెటూ!' అని అడుగుతూ వెళ్ళేవాళ్లం. ఇప్పుడిక ఆ అవసరమే లేకుండా పోయిందనుకున్నాం. మా బాల్యస్మృతులూ కొన్ని గుర్తుచేసుకుంటూ 3:30 గంటలకు మంగినపూడి బీచ్‌కి చేరుకున్నాం. ఎంట్రెన్స్‌లో ఉన్న రెండు చేపల ద్వారాన్ని దాటుకుంటూ బీచ్‌లోకి అడుగుపెట్టాం. బీచ్‌కు వెళ్లేందుకు, పార్కింగ్‌కు ఎలాంటి టికెట్టూ లేదు. హమ్మయ్యా పోనీలే అనుకుంటూ బండి పార్క్‌ చేశాం. మా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ గతాన్ని గుర్తు చేేసుకుంటూ వాస్తవం గురించి ఆలోచిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తీరంవెంబడి అడుగులు కాసేపు కాలక్షేపం చేశాం. ఆ సముద్రపు అలలు మా పాదాలను తాకుతూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి. అలా సముద్రంలో కాసేపు జలకాలాటలాడి కొన్ని ఫొటోలు, సెల్ఫీలు దిగాం. 

భలే భలే రైడ్‌! 
బయలుదేరదాం అని వెనక్కి తిరిగి నాలుగడుగులేశాక నాలుగు చెక్రాల బైకులు కనిపించాయి. ఎప్పుడూ చూడని ఆ బైకులు మా కళ్ళకు కొత్తగా కనపడ్డాయి. చిన్నప్పుడు కంప్యూటర్‌లో ఇలాంటి బండ్ల మీద రేసింగ్‌ గేమ్స్‌ ఆడేవాళ్ళం. అది గుర్తొచ్చింది. అక్కడే ఉన్న యజమాని మమ్మల్ని పిలిచి ''బైక్‌ ఎక్కండి బాబూ! బ్యూటిఫుల్‌గా ఉంటుంది!!'' అంటూ మాటలు కలిపాడు. ఒక్కొక్కరికీ వంద రూపాయలు తీసుకుని, చెరొక బైకూ ఎక్కించాడు. ఇక 'రరు రరు' అనుకుంటూ అరకిలోమీటరుకి ఎక్కువా, ముప్పావు కిలోమీటరుకి తక్కువ దూరం వరకూ వెళ్ళి దానిమీద మరో రెండు సెల్ఫీలు దిగి, వెనక్కి వచ్చేశాం. ఇక ఆ బైకు వివరాలు కనుక్కుందామని అడిగితే దాని రేటు రెండున్నర లక్షలు అనగానే మా కళ్ళు బైర్లు కమ్మాయి. మరి సందర్శకులని ఆకర్షిస్తున్నాయా...? అనడిగితే వాళ్ళు తెల్ల మొహం వేశారు. ''ఇక్కడికొచ్చేది చాలా తక్కువ మంది, ఈ బైక్‌ ఎక్కడానికి వందరూపాయిలు ఖర్చు చేయటానికే భయపడుతున్నారు. ఇక గిరాకీ ఏం ఉంటుందీ?'' అంటూ వాపోయారు. ''లీటరుకి 4, 5 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది అంతే. ఏదైనా రిపేర్‌ వచ్చిందంటే ఇక మాకు తిప్పలు వచ్చి పడ్డటే. ఏ పార్టు మార్చాలన్నా వేలల్లోనే ఖర్చుంటుందని'' నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు అక్కడే వీళ్ళు కెమెరా పట్టుకుని తిరిగేవారట! ఇప్పుడు ఆ కెమెరామెన్‌ జాబు పార్ట్‌ టైమ్‌ అయింది. ఈ బైక్‌ రైడింగ్‌ జాబ్‌ ఫుల్‌టైమ్‌ అయింది. ఈ బైక్‌ రైడ్‌ ఎట్రాక్షన్‌ ఇంకెక్కడైనా ఉందా అనడిగితే ''మన రాష్ట్రంలో వైజాగ్‌లో ఉంది. కానీ వైజాగ్‌ బీచ్‌కి మంగినపూడి బీచ్‌కీ చాలా తేడా ఉంది. అక్కడికి వచ్చినంత మంది పర్యాటకులు ఇక్కడికి రారు. అందువల్ల ఈ బైక్‌ రైడ్‌ ఎక్కువ మందికి తెలియదు. ప్రభుత్వమూ జోక్యం చేసుకుని ఇక్కడ టూరిజం డెవలప్‌ చేస్తే, ఇంకాస్త ఆదరణ వస్తుంది'' అని ముగించారు. 

అలా ఆ బైకుల గురించి మాట్లాడుకుంటూ 5:30 గంటలకు బీచ్‌ నుంచి విజయవాడకి తిరుగు ప్రయాణమయ్యాం. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూటు ఇంకా వెడల్పు చేస్తున్నారు. ఇప్పుడు కాస్త వెడల్పుగానే ఉన్నాగానీ జాగ్రత్తగానే నడపాలి. ఇక విజయవాడ చేరే సరికి 8:30 అయింది. బెజవాడ ఫేమస్‌ బాబారు హోటల్‌కి వెళ్ళి చెరొక ప్లేటూ నేతి ఇడ్లీలూ, ఉప్మా పెసరట్లూ తిని మరిన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇంటికి చేరుకున్నాం. మా జీవితంలో మచిలీపట్నం ట్రిప్పు ఎప్పటికీ గుర్తుండిపోయేదిగా నిలిచిపోతుంది. 

- బ్రౌన్‌, హర్షా 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com