ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు

- December 29, 2017 , by Maagulf
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని కీలక నగరాల్లో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, నిరుద్యోగం, ఆర్థిక అసమానత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్‌తో పాటు కేర్‌మన్‌షా, రస్త్, ఇస్‌ఫహాన్, కోమ్ నగరల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇరాన్‌లో రెండవ అతిపెద్ద నరగరమైన మాష్‌హద్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. వేలాది మంది ర్యాలీ తీసినట్లు సోషల్ మీడియలో ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమ సెగలు మిగతా నగరాలకు కూడా పాకింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. గుడ్డు ధర కూడా 40 శాతం పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిరుద్యోగం కూడా ఇరాన్‌ను వేధిస్తున్నది.

గత ఆగస్టులో ద్రవ్యోల్బణం 10 శాతం ఉన్నట్లు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్నది. నిరుద్యోగం 12.7 శాతానికి చెరుకున్నట్లు వరల్డ్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహానీకి వ్యతిరేకంగా నినాదాలు మారుమోగాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆందోళనాకరలు డిమాండ్ చేశారు.

గత మే నెలలో రోహానీ రెండవసారి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సాంప్రదాయ ప్రతిపక్షాల నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్నది. దేశాన్ని సరళీకరించేందుకు రోహానీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక విప్లవం మొదలైందని నిపుణులు అంటున్నారు. ఇరాన్‌లో చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంపై అమెరికా కూడా స్పందించింది. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు చూస్తున్నాయని పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com