దుబాయ్‌లో ఉద్యోగాలంటూ మోసం, ఎయిర్ పోర్ట్ లో నిందితుడి అరెస్ట్

- January 20, 2018 , by Maagulf
దుబాయ్‌లో ఉద్యోగాలంటూ మోసం, ఎయిర్ పోర్ట్ లో నిందితుడి అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన నిందితుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌కు చెందిన కర్మాగిల్‌ అన్బు జేమ్స్‌, భరత్‌లు సామాజిక మాధ్యమాల ద్వారా విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారు. దుబాయ్‌లోని షాపింగ్‌మాల్స్‌లో సేల్స్‌ సూపర్‌వైజర్లుగా ఉద్యోగాలిప్పిస్తామంటూ రెండేళ్ల క్రితం వీరిచ్చిన ప్రకటన ఆధారంగా హైదరాబాద్‌ శాంతి నగర్‌ వాసి కాంతి ఆనంద్‌.. కర్మాగిల్‌ను సంప్రదించింది. సేల్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం ఇస్తామంటూ ఆమెను నమ్మించిన అతను..రూ.50 వేలు తన ఖాతాలో జమచేస్తే రెండు వారాల్లో వీసా పంపుతానని చెప్పాడు.

ఆమె ద్వారా మరో 14 మంది కూడా రూ.50 వేలు చెల్లించారు. తర్వాత రిజిస్ట్రేషన్‌, విమానాశ్రయంలో నిబంధనలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున దాదాపు రూ.37 లక్షల వరకూ దండుకున్న తర్వాత ఇద్దరూ తమ చరవాణిలు స్విచ్ఛాఫ్‌ చేశారు. కాంతి ఆనంద్‌ ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. కర్మాగిల్‌ దుబాయ్‌ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో గురువారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీసీపీ అవినాశ్‌ మహంతి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com