ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం ...

- January 20, 2018 , by Maagulf
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం ...

ఢిల్లీ అగ్నిప్రమాదం 17మందిని సజీవ దహనం చేసింది. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాణాసంచా కర్మాగారంలో మంటలు అంటుకోగా.. భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 10కి పైగా ఫైర్‌ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశాయి. అర్థరాత్రికి కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మంటలు అదుపు చేసినా మృతదేహాల వెలికితీత, గుర్తింపు కష్టంగా మారింది. 

భావన పారిశ్రామిక వాడలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్‌ గోడౌన్‌ పేరుతో బాణాసంచా తయారు చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. మరో అంతస్థులో రబ్బరు గోడౌన్‌ ఉండటంతో రబ్బరుకు మంటలు అంటుకొని.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇటు మంటలు, అటు దట్టమైన పొగతో భవనంలో చిక్కుకున్న కార్మికులు మృత్యువాత పడ్డారు. బిల్డింగ్‌ ఇరుకుగా ఉండటంతో తప్పించుకునే దారి లేకుండా పోయింది. చాలామంది కార్మికులు పొగకు ఊపిరాడక పడిపోవడంతో మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు. కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భవనంలో ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్‌ లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. 

ప్రధాని మోడీ సైతం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ఈ ఉదయానికి కొలిక్కి వచ్చాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com