భాగమతి రివ్యూ :

- January 26, 2018 , by Maagulf
భాగమతి రివ్యూ :


చిత్రం: భాగమతి 
నటీనటులు: అనుష్క.. ఉన్ని ముకుందన్‌.. జయరాం.. ఆశా శరత్‌.. ప్రభాస్‌ శ్రీను.. ధనరాజ్‌.. మురళీశర్మ.. తలైవాసల్‌ విజయ్‌.. విద్యుల్లేఖ రామన్‌ తదితరులు 
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ 
ఛాయాగ్రహణం: ఆర్‌.మది 
కళ: ఎస్‌.రవీందర్‌ 
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు 
నిర్మాత: వంశీ.. ప్రమోద్‌ 
దర్శకత్వం: జి.అశోక్‌ 
బ్యానర్‌: యూవీ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 26-01-2018

ఈతరంలో కథానాయికల్లో నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలంటే దర్శక-నిర్మాతలకు టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క. 'అరుంధతి'తో అది నిరూపితమైంది. ఒకపక్క హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలను చేస్తూనే గ్లామర్‌ రోల్స్‌కూ సై అంటుంది స్వీటి. ఇక 'బాహుబలి' చిత్రాలతో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేవసేనగా తనదైన శైలిలో మెప్పించింది. ఇప్పుడు 'భాగమతి'గా అలరించేందుకు సిద్ధమైంది. ఎప్పుడో 2012లో పునాదులు పడ్డ ఈ సినిమా కేవలం అనుష్క కోసమే దర్శక-నిర్మాతలు ఇంతకాలం వేచి చూశారు. ప్రచార చిత్రాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరి 'భాగమతి'గా అనుష్క లెక్కలు తేల్చిందా? అనుష్కపై దర్శక-నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం నిజమైందా?
కథేంటంటే: ఐఏఎస్‌ అధికారి చంచల(అనుష్క) కేంద్ర మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌(జయరాం) దగ్గర పర్సనల్‌ సెక్రటరీగా పనిచేస్తుంటుంది. మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతూ రాజకీయంగా సొంత నిర్ణయాలు తీసుకుంటుండటంతో అతన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని అధిష్ఠానం పెద్దలు నిర్ణయిస్తారు. అప్పటికే ఒక హత్య కేసులో జైలులో ఉన్న చంచలను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని పురాతన భాగమతి బంగ్లాకు తరలించి, ఈశ్వర్‌ప్రసాద్‌ చేసిన వ్యవహారాలపై ఆరా తీస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్‌ ప్రసాద్‌ గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి. హత్య కేసులో చంచల జైలుకు వెళ్లడానికి కారణం ఏంటి? ఆమె ఎవరిని? ఎలా హత్య చేసింది? ఆమెకూ, కాళంగి రాజ్య భాగమతి శతపత్ర రాణికీ సంబంధం ఏంటి?
ఎలా ఉందంటే?: లెక్క తేలాల్సిందే అంటూ ప్రచార చిత్రాల్లో భాగమతి అవతారంలో అనుష్క చేసిన సందడిని చూసి ఇది పూర్తిగా ఆ పాత్ర చుట్టూ సాగే సినిమా అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ, ఇందులో భాగమతికంటే కూడా చంచల కథే ఎక్కువ. కాళంగి రాజ్యం కంటే కూడా వర్తమాన పరిస్థితులే ఎక్కువగా తెరపై కనిపిస్తాయి. ఒక రాజకీయ నాయకుడి నేర ప్రస్థానం చుట్టూ కథను రాసుకున్న దర్శకుడు దాన్ని భాగమతి బంగ్లా నేపథ్యాన్ని జోడించి, భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ కథలో నాలుగైదు చోట్ల హారర్‌ ఎలిమెంట్స్‌ బలంగా పండాయి. తమన్‌ నేపథ్య సంగీతంతో ప్రేక్షకుడిని భయపెట్టే ప్రయత్నం చేశారు. మిగిలినదంతా ఈశ్వర ప్రసాద్‌ ఎత్తులు, పైఎత్తులు అతని పన్నాగాన్ని చిత్తు చేసే చంచల కథే తెరపై కనిపిస్తుంది.

భాగమతి బంగ్లాలోకి వెళ్లాకే అసలు కథ వూపందుకుంటుంది. అక్కడ కూడా ఎక్కువ సన్నివేశాలను బంగ్లాను చూపించడానికే పరిమితం చేశారు. దాంతో సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. విరామ సమయానికి భాగమతి అవతారంలో అనుష్క తెరపై కనిపించి కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు చంచలను విలన్‌గా మార్చినంత పనిచేస్తాయి. దాంతో కథ ఎటువైపు మళ్లుతుందో అనే ఉత్కంఠ రేకెత్తుతుంది. కానీ, అక్కడ మరో మలుపు చోటు చేసుకోవడంతో పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: అనుష్క నటనే చిత్రానికి ప్రధాన బలం. చంచలగా, భాగమతిగా రెండు పాత్రల్లోనూ చక్కటి అభినయం ప్రదర్శించింది. ముఖ్యంగా భాగమతిగా భయపెట్టిన విధానం బాగుంది. ఐఏఎస్‌ అధికారి పాత్రకు తగినట్టుగా చాలా హుందాగా నటించింది. రెండు పాత్రల విషయంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు, వైవిధ్యం చూపిన విధానం ఆమె అనుభవానికి అద్దం పట్టాయి. ఆశా శరత్‌ అభినయం ఆకట్టుకుంది. జయరాం, ఉన్ని ముకుందన్‌ పాత్రలను తీర్చిదిద్దిన విధానం భాగుంది. ప్రభాస్‌ శ్రీను, ధనరాజ్‌, విద్యుల్లేఖ రామన్‌లు అక్కడక్కడా నవ్వించారు. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. మది ఛాయాగ్రహణం, తమన్‌ సంగీతం కథను మరింత ప్రభావవంతంగా మార్చాయి. తమన్‌ నేపథ్య సంగీతం భయపెట్టిస్తుంది. రవీందర్‌ కళా నైపుణ్యం తెరపై అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడు అశోక్‌ కథ రాసుకున్న విధానం, కథనాన్ని అల్లిన వైనం బాగుంది. హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు, పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.
బలాలు 
+ అనుష్క నటన 
+ కథలో మలుపులు 
+ సాంకేతిక విభాగం 
+ నిర్మాణ విలువలు

బలహీనతలు 
- అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు 
- హారర్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువ లేకపోవడం

చివరిగా: లెక్కతేల్చిన 'భాగమతి' 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com