నం.1 శత్రువు భారత్‌.. నం.2 మోదీ!!

- January 26, 2018 , by Maagulf
నం.1 శత్రువు భారత్‌.. నం.2 మోదీ!!

ఇస్లామాబాద్‌ : భారతదేశం 69వ గణతంత్ర వేడుకల్లో మునిగిపోయినవేళ.. పాకిస్తాన్‌ గడ్డపై నుంచి వెలువడిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. చైనా అండతో నిర్బంధం నుంచి తప్పించుకు తిరుగుతున్న మౌలానా మసూద్‌ అజార్ నేతృత్వంలోని జైష్‌ ఏ మొహమ్మద్‌.. ఇండియాను ప్రప్రధమ శత్రువుగా ప్రకటించింది.

సింధ్‌ రాష్ట్రంలోని లర్కానాలో జరిగిన బహిరంగ సభలో అజార్‌ సోదరుడు, జేషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్‌ ఈ విషయాలను వెల్లడించాడు. ‘హిందుస్తాన్‌పై జిహాద్‌కు ముందుకురావాల’ని యువతను రెచ్చగొట్టాడు. ఒకవైపు తనను తాను ఉగ్రబాధిత దేశంగా చెప్పుకునే పాక్‌.. ఇలా బాహాటంగా జిహాద్‌కు పిలుపునిస్తున్న నేతలను  మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తుండటం గమనార్హం.

కశ్మీరీలు పిలుస్తున్నారు : ‘‘మనకు నంబర్‌ 1 శత్రువు ఇండియా, నంబర్‌ 2 మోదీ. అల్‌ ఖలామ్(అజార్ నేతృత్వంలో నడిచే పత్రిక) ద్వారా ఈ సందేశాన్ని అందరికీ చేరవేయండి. భారత్‌లోని మనవాళ్లు అల్‌ ఖలామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చు. ఉపఖండంలో మినీ సూపర్‌ పవర్‌గా వ్యవహరిస్తోన్న భారత్‌.. మొదటి నుంచీ పాకిస్తాన్‌కు అడ్డంకులు సృష్టిస్తూనేఉంది. కానీ కశ్మీర్‌లో మాత్రం భారత సైన్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కశ్మీరీ తల్లులు, సోదరీమణులు సాయం కోసం మనల్ని(పాకిస్తానీలను) పిలిచారు. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్‌లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్‌ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు మరింత మంది ముందుకురావాలి’’ అని మౌలానా సైఫ్‌ వ్యాఖ్యానించాడు.
పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్‌ సంస్థ ప్రమేయం తెలిసిందే. ఆ సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించి, నిర్బంధించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ పోరాడింది. కానీ తీర్మానం జరిగిన ప్రతిసారి వీటో చేసిన చైనా అజార్‌ను కాపాడుకుంది. ఇప్పుడు టార్గెట్‌ ఇండియా, మోడీలేనని సాక్షాత్తు అజార్‌ సోదరుడే ప్రకటించడంపై దేశాల స్పందిన వెలువడాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com