పది గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం క్లోజ్

- January 29, 2018 , by Maagulf
పది గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం క్లోజ్

తిరుపతి: చంద్రగ్రహణం కారణంగా జనవరి 31న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. దీంతో ఆ సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేస్తున్నట్లు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నదని, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ తరువాత రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణ ఉండదని, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదని జెఈవో తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశామన్నారు. భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా జేఈవో కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com