అమరావతిలో... కంటైనర్‌ హోటల్స్‌!... కొత్తకాన్సెప్టు ... తొలిప్రయోగం...

- February 04, 2018 , by Maagulf
అమరావతిలో... కంటైనర్‌ హోటల్స్‌!... కొత్తకాన్సెప్టు ... తొలిప్రయోగం...

అమరావతి: అమరావతికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి కోసం ఆతిథ్యం ఇచ్చేందుకు ఏపీసీఆర్డీయే ఒక వినూత్నఆలోచన చేస్తోంది. రాజధానిలో శాశ్వత ప్రాతిపదికన హోటళ్ల స్థాపనకు కనీసం 3 నుంచి 5 ఏళ్లు పట్టే అవకాశమున్నందున...అప్పటివరకు అతిధులకు ఇబ్బంది లేకుండా అతి తక్కువ వ్యవధిలో, స్వల్ప నిర్మాణ వ్యయంతో ఏర్పాటు చేసేందుకు వీలయ్యే కంటైనర్ హోటళ్లు స్థాపించాలని యోచించింది.

ఈ ప్రతిపాదనను ఇటీవల జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో కమిషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలపగా ఆయన వెంటనే ఆమోదించినట్లు తెలిసింది. అయితే ముందుగా ఈ ఏడాది ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో విజయవాడకు సమీపంలోని భవానీద్వీపంలో జరిగే హ్యాపీ సిటీస్ సదస్సుకు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ఇలాంటి 100 కంటైనర్ గదులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించిరట. అనంతరం మరిన్ని కంటైనర్‌ హోటళ్ల స్థాపనపై ముందుకు వెళ్దామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.

కంటైనర్ హోటలా...అంటే... 
కంటైనర్ హోటలా...అంటే...మనకే కొత్త...
షిప్ ల ద్వారా సరకు రవాణాకు ఉపయోగించే కంటైనర్లనే చక్కటి హోటల్ రూమ్ లా తీర్చిదిద్దడమే కంటైనర్ హోటల్ కాన్సెప్ట్...ఇలా షిప్‌ కంటైనర్లను సకల వసతులతో కూడిన అధునాతన హోటల్‌ గదుల్లాగా మార్చి వాడుకునే ప్రక్రియ మనకు కొత్తయినప్పటికీ పలు విదేశాల్లో కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. పైగా వీటిని మనకు అనువుగా మలుచుకోవడం సులభతరమే కాకుండా రూపకల్పనలో సృజనాత్మకతకు, ఆధునికతకు అవకాశం ఉండటం గమనార్హం.


కంటైనర్ హోటల్...కాన్సెప్ట్ అదుర్స్... 
కంటైనర్ హోటల్...కాన్సెప్ట్ అదుర్స్...ఎందుకంటే...
ఈ కంటైనర్‌ హోటళ్లను కేవలం ఒక నెలలోపే ఏర్పాటు చేసేయొచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ...ఇప్పటికే ముంద్రా సెజ్‌లో ఇలాంటి దాన్నినెలకొల్పగా ఈ ప్రాజెక్ట్ అక్కడ బాగా క్లిక్ అయినట్లు చెబుతున్నారు. పైగా వీటి నిర్మాణంలో ఎలాంటి కాలుష్యపరమైన సమస్యలు తలెత్తవు...అంతేకాదు ఇవి తాత్కాలిక హోటళ్లు కావడంతో ఎక్కడ అవసరమో అక్కడ అంత కాలం ఉంచి, తర్వాత వేరొక చోటకు సులభంగా తరలించి మళ్లీ వేరేచోట వాడుకోవచ్చు.
ప్రయోగాత్మక ప్రాజెక్ట్... 
ప్రయోగాత్మక ప్రాజెక్ట్...సంతోష నగరాల సదస్సు కోసం...
ఈ ఏడాది ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో విజయవాడకు సమీపంలోని భవానీద్వీపంలో 3 రోజుల పాటు జరిగే హ్యాపీ సిటీస్ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నందున వారి కోసం ఇలాంటి కంటైనర్ గదులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ హ్యాపీ సిటీస్ సదస్సు ద్వారా మరోసారి అమరావతి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటే అవకాశం దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల ఈ సదస్సులో పాల్గొనేందుకు రావాల్సిందిగా సంతోష సూచికలో తొలి 50 స్థానాలలో ఉన్న నగరాలకు లేఖలు రాయాలని, వారి రాకతో ఆయా నగరాలలో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలు, వినూత్న పద్ధతుల గురించి మనం తెలుసుకునేందుకు ఈ అంతర్జాతీయ సదస్సు తప్పకుండా దోహదపడుతుందని సిఎం అభిప్రాయపడ్డారు.
హ్యాపీ సిటీస్ సదస్సు... 
హ్యాపీ సిటీస్ సదస్సు...ప్రతినిధులకు తొలిసారిగా ఆతిథ్యం...
హ్యాపీ సిటీస్ సదస్సు కోసం దేశ, విదేశీ ప్రతినిధులు సుమారు 2 వేల మంది తరలివచ్చే అవకాశ ఉన్నందున వీరందరికీ విజయవాడ, గుంటూరు నగరాలలోని హోటళ్లలో వసతి కల్పించాలని చెప్పారు. అవసరమైతే భవానీద్వీపంలోనే 200 తాత్కాలిక గదులతో వసతికి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాదు అమరావతిలో నెలకొల్పాలనుకుంటున్న 100 కంటైనర్ హోటల్ రూమ్‌లను తొలుత ప్రయోగాత్మకంగా మొదట ఇక్కడ భవానీద్వీపంలో ఏర్పాటు చేయడం ద్వారా సంతోష నగరాల సదస్సుకు వినియోగించుకోవచ్చునని ముఖ్యమంత్రే సూచించారు. పేరొందిన స్టార్ హోటళ్ల నిర్వహణా భాగస్వామ్యంతో అమరావతిలో కనీసం 100 కంటైనర్ హోటల్ రూములను ఏర్పాటు చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com