ముస్లిం నేతలతో శ్రీశ్రీ రవిశంకర్‌ చర్చలు

- February 08, 2018 , by Maagulf
ముస్లిం నేతలతో శ్రీశ్రీ రవిశంకర్‌ చర్చలు

బెంగళూరు: అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిగా చేస్తున్న కృషిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌(ఏవోఎల్‌) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ వేగవంతం చేశారు. సున్నీ వక్ఫ్‌ బోర్డు (ఎస్‌డబ్ల్యూబీ), అఖిల భారత ముస్లిం పర్సనల్‌ న్యాయ మండలి (ఏఐఎంపీఎల్‌బీ) సభ్యులు సహా ప్రధాన ముస్లిం నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం కోర్టు వెలుపల పరిష్కారానికి ఎస్‌డబ్ల్యూబీ, ఏఐఎంపీఎల్‌బీ సభ్యులు మద్దతు పలికినట్లు ఏవోఎల్‌ ఓ ప్రకటన విడుదలచేసింది. 'మసీదును వేరే ప్రాంతానికి తరలించే ప్రతిపాదనకు ముస్లిం నేతలు మద్దతుపలికారు. ఈ విషయంలో సహకరిస్తామని హామీ ఇచ్చారు'అని దానిలో పేర్కొంది. భిన్న సంస్థలకు చెందిన 16 మంది ముస్లిం నేతలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, విద్యావేత్తలు సమావేశంలో పాల్గొన్నారని తెలిపింది. త్వరలో అయోధ్యలోనూ ఓ భారీ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. ఏఐఎంపీఎల్‌బీ కార్యనిర్వాహక సభ్యుడు మౌలానా సయ్యద్‌ సల్మాన్‌ హుస్సేన్‌ నద్వీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎస్‌డబ్ల్యూబీ ఛైర్‌పర్సన్‌ జుఫర్‌ అహ్మద్‌ ఫరూఖి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా.అనీస్‌ అన్సారీ, లండన్‌కు చెందిన ప్రపంచ ఇస్లామిక్‌ వేదిక మౌలానా ఇసా మన్సూరీ, వ్యాపారవేత్త ఏఆర్‌ రెహమాన్‌, భారత హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ అబూబకర్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. చర్చలకు మంచి స్పందన వస్తోందని ఇటీవల రవి శంకర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే విశ్వ హిందూ పరిషత్తు వీటికి దూరంగా ఉంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com