విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌లో ఉచిత పిల్లల గుండె ఆపరేషన్లు

- February 09, 2018 , by Maagulf
విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌లో ఉచిత పిల్లల గుండె ఆపరేషన్లు

విజయవాడ : విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌, హీలింగ్‌ హార్ట్‌, యుకె చారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌ వైద్య బృందం సహకారంతో 20 మంది చిన్న పిల్లలకు ఉచితముగా గుండె సర్జరీలు నిర్వహించామని ఆసుపత్రి చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ పివి.రామారావు తెలిపారు. శుక్రవారం ఆంధ్ర హాస్పిటల్‌ బ్రెయిన్‌ అండ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు సంవత్సరాల నుంచి ఆంధ్ర హాస్పిటల్‌లో పెద్దలకే కాకుండా చిన్న పిల్లలకూ గుండె ఆపరేషన్‌లు విజయవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత నెల జనవరి 22 నుంచి 27 వరకు, ఈ నెల ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు పిల్లల గుండె ఆపరేషన్‌లు ద్విగ్విజయంగా 20 మందికి పూర్తి చేశామన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు ట్రాన్సపోసిషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ ఆర్టరీస్‌, టెట్రాలజీ ఆఫ్‌ ఫాలో, ఆబ్సెంట్‌ పల్మనరీ ఎట్రీసియా, కంప్లీట్‌ ఎవీఎస్డీ, డబల్‌ అవుట్లెట్‌ రైట్‌ వెంట్రికల్‌కు సంబంధించిన ఆపరేషన్‌లు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. మార్చి 18 నుంచి 24 వరకు 3వ క్యాంపు ప్రారంభమవుతుందన్నారు. ఈ సంవత్సరం 6 నుంచి 7 క్యాంపులు నిర్వహిస్తామని, ఒక్కొక్క ఆపరేషన్‌కు 7 గంటల నుంచి ఒక రోజంతా పడుతుందని అన్నారు. ఈ సక్సెస్‌ అంతా టీం వర్క్‌ వల్లే సాధ్యమయిందని తెలిపారు.

అనంతరం కార్డియాక్‌ ఎనస్తీటిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ఇదంతా మీడియా సహకారం వల్లే జరిగిందని, మీడియా ప్రచారం వల్ల ప్రజలు తొందరగా గుర్తించి తమ దగ్గరకు వస్తుండటంతో ఎర్లీగా గుండె ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో గుండె జబ్బుల వైద్య నిపుణులు శ్రీమన్నారాయణ, దిలీప్‌, విక్రం, రమణ, అమల్‌ బోస్‌, నవీన్‌ రాజ్‌, పీటర్‌ జిరాసెక్‌, కృష్ణప్రసాద్‌, కలైమని, విక్టోరియా, మానులెలా, కార్ల థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com